రేవంత్​ అనంగనే 3 గంటలే ఇస్తమా? : కాంగ్రెస్​ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి

రేవంత్​ అనంగనే 3 గంటలే ఇస్తమా? : కాంగ్రెస్​ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి

హైదరాబాద్​, వెలుగు : అమెరికాకు వెళ్లాక రెండ్రోజుల్లో రేవంత్​ రెడ్డి అలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని కాంగ్రెస్​ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి అన్నారు. తానాలో పాల్గొన్న బాలకృష్ణ, ఎర్రబెల్లి దయాకర్​ రావు ప్రభావమేమైనా పడిందేమోనని ఆయన కామెంట్​ చేశారు. హైదరాబాద్​లో ఎప్పుడూ కంట్రోల్​గానే రేవంత్​ మాట్లాడేవారని, కానీ, అమెరికాలో ఎందుకు నోరు జారారోనని అన్నా రు. 

మంగళవారం వెంకట్​రెడ్డి  హైదరాబాద్​లోని తన ఇంట్లో మీడియాతో మాట్లాడారు. ‘‘రేవంత్​ రెడ్డి అనంగనే మేం 3 గంటల కరెంటే ఇస్తమా? ఈ విష యంలో పీసీసీ నిర్ణయం ఫైనల్​ కాదు. పీసీసీ చెప్పింది చెల్లదు. ఏఐసీసీకి, కార్యకర్తలకు మధ్య పీసీసీ కోఆర్డినేటర్​ మాత్రమే. రేవంత్​ కామెంట్లు వ్యక్తిగత అభిప్రాయాలు. రేవంత్​ రెడ్డి ఒక్కడే ఇక్కడ పార్టీ కాదు. మమ్మల్ని కాదని నిర్ణయం తీసుకుంటరా. ఆయనొచ్చాక దానిపై చర్చిస్తం. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో దీనిపై మాట్లాడిన. ఆయన తిరుపతిలో ఉన్నడు’’ అని అన్నారు. ఉచిత కరెంట్​ పథకం తెచ్చిందే కాంగ్రెస్​ పార్టీ అని గుర్తు చేశారు. ‘‘రాజశేఖర్​ రెడ్డి హయాంలో మేనిఫెస్టోలో పెట్టి మరీ 7 గంటలు ఫ్రీ కరెంట్​ ఇచ్చినం. రూ.1,300 కోట్ల బకాయిలనూ రద్దు చేసినం. అలాంటి దాన్ని ఎందుకు ఎత్తేస్తం! పకడ్బందీగా 24 గంటల ఉచిత కరెంట్​ను అందిస్తం. 24 గంటల్లో 24 సెకన్లు కూడా కరెంట్​ పోనియ్యం” అని ఆయన తెలిపారు. 

ముందు విద్యుత్​ సంస్థల్లో వాళ్లను తీసెయ్యండి

‘‘ముందు విద్యుత్​ సంస్థల్లో రిటైర్​ అయిన ముసలోళ్లను పదవుల నుంచి తీసెయ్యాలి” అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి డిమాండ్​ చేశారు. ‘‘జెన్​కో సీఎండీ ప్రభాకర్​రావు 20 ఏండ్ల కింద, రఘుమా రెడ్డి.. 30 ఏండ్ల కింద రిటైర్​ అయ్యిన్రు. నలుగురు మోసుకెళ్తేగానీ ఆఫీసులోకి వెళ్లలేని వరంగల్ ​డిస్కం సీఎండీ గోపాల్​ రావు వంటి వాళ్లకు మళ్లీ పదవులిచ్చి రాష్ట్ర ప్రభుత్వం కూర్చోబెట్టింది. ముందు ఆ ముసలోళ్లను తీసేసి.. వంద మంది యువ ఐఏఎస్​లు ఖాళీగానే ఉన్నరు కదా.. వారిని నియమించండి. గ్రామాల్లో ఇప్పటికీ పది గంటలు కరెంట్​ పోతున్నది. జగదీశ్​ రెడ్డి అంటే పవర్​ లేని పవర్​ మినిస్టర్​​’’ అనివిమర్శించారు. 

కాంగ్రెస్​ అంటే రేవంత్​ కాదు

సీతక్క సీఎం అని రేవంత్​ అనడం పెద్ద జోక్​ అని వెంకట్​ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్​ అధికారం లోకి వచ్చాక ఎమ్మెల్యేలను వన్​ టు వన్​ అడిగో లేదం టే బ్యాలెట్​ పెట్టో అధిష్ఠానం సీఎం క్యాండిడేట్​ను నిర్ణయిస్తుందన్నారు. గతంలో హిమాచల్​ ప్రదేశ్​, కర్నాటక ఎన్నికల్లో ఇదే జరిగిందని తెలిపారు. ‘‘మీటింగ్​ పెట్టి సీఎం పదవిని దళితులకు ఇవ్వాల్నా.. గిరిజనులకా.. లేదా బీసీలకు ఇవ్వాలా అన్నది నిర్ణయిస్తారు. గిరిజనులకే కావాలనుకుంటే పొదెం వీరయ్య కూడా మూడో సారి ఎమ్మెల్యే.. 30ఏండ్ల నుంచి కాంగ్రెస్​ పార్టీలోనే ఉన్నడు. 

మరి, వీరయ్యకేం తక్కువ. దళితులకు ఇవ్వాలని గతంలో చెప్పినం. దామోదర​ రాజనర్సింహ, భట్టి విక్రమార్క వంటి వాళ్లూ ఉన్నారు. దళితులకు సీఎం పదవి ఇవ్వాలె.. అది నేను కూడా ఒప్పుకుంటా’’ అని అన్నారు. కానీ, రేవంత్​ రెడ్డి వ్యాఖ్యలు తనను బాధించాయని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ  70 సీట్ల మెజారిటీతో గెలుస్తుందన్నారు. రేవంత్​ అంటే కాంగ్రెస్​.. కాంగ్రెస్​ అంటే రేవంత్​ అని అనడం కరెక్ట్​ కాదని చెప్పారు.