రాష్ట్రంలో విద్య, వైద్యంపై తీవ్ర నిర్లక్ష్యం: రాహుల్ గాంధీ

రాష్ట్రంలో విద్య, వైద్యంపై తీవ్ర నిర్లక్ష్యం: రాహుల్ గాంధీ

సంగారెడ్డి, వెలుగు: పొద్దున ఇరిగేషన్ ప్రాజెక్టుల కమీషన్లు, రాత్రి ధరణి పోర్టల్ చూసి ఏయే భూములు ఎక్కడున్నయో తెలుసుకునుడే సీఎం కేసీఆర్ దినచర్యగా మారిందని.. రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించిందని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​గాంధీ అన్నారు. విద్య, వైద్యంపై తీవ్రమైన నిర్లక్ష్యంగా కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలో విద్యను ప్రైవేటీకరిస్తూ ప్రభుత్వ విద్యాలయాల్లో ఫుడ్ పాయిజన్లు అయితున్నా కేసీఆర్ పట్టించుకోవట్లేదని ఆరోపించారు. దేశంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ఒకే విధంగా పాలిస్తున్నారని విమర్శించారు. భారత్​ జోడో పాదయాత్ర గురువారం సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, అందోల్ నియోజకవర్గాల పరిధిలో కొనసాగింది. సాయంత్రం చౌటకూర్​ మండలం శివంపేట కార్నర్ మీటింగ్​లో రాహుల్ మాట్లాడారు.

నరేంద్ర మోడీ నోట్ల రద్దు నిర్ణయంతో లక్షల మంది ఉద్యోగాలు పోయాయన్నారు. జీఎస్టీ వల్ల చిన్నతరహా సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లి దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిందన్నారు. మోడీ తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు కేసీఆర్ మద్దతు పలికారని వాళ్లిద్దరు తోడు దొంగలని విమర్శించారు. స్విచ్ వేస్తే లైట్ వెలిగినట్లు మోడీ ఆదేశించగానే కేసీఆర్ ఆచరించి చూపిస్తారని చెప్పారు. దేశంలో మోడీ.. రాష్ట్రంలో కేసీఆర్ ప్రజా పాలన కొనసాగిస్తున్నారన్నారు. తాను మాత్రం భారత్ జోడో యాత్ర కొనసాగిస్తున్నట్టు తెలిపారు.

కర్నల్ ​సంతోష్ కుటుంబానికి అవమానం 

భారత భూభాగంలోని 2వేల కిలోమీటర్లు చైనా ఆక్రమిస్తే మోడీ చూస్తూ కూర్చున్నారని రాహుల్​ విమర్శించారు. ‘‘కర్నల్ సంతోష్ బాబు ప్రాణత్యాగం వృథా అయ్యింది. సంతోష్ వీరమరణం పొందాక చైనా ఇండియా భూభాగంలోకి రాలేదని ప్రధాని అంటున్నడు. దీన్ని బట్టి చూస్తే మోడీ సంతోష్ బాబు కుటుంబాన్ని అవమాన పరిచినట్టే’’ అని రాహుల్ మండిపడ్డారు. సంతోష్ బాబు వీర మరణాన్ని మరిచిపోలేక పోతున్నానని.. దేశంలో కోసం ఆయన ప్రాణత్యాగం చేశానని తెలిపారు.

జగ్గారెడ్డితో స్టెప్పులు

భారత్ జోడో యాత్ర సంగారెడ్డిలో వివిధ కులసంఘాల సంప్రదాయ నృత్యాలతో ఉత్సాహంగా సాగింది. బుడగజంగాలు, పెద్దమ్మలొల్లతో కలిసి రాహుల్ చర్నకోల విన్యాసాలు చేశారు. అంతకు ముందు ఎమ్మెల్యే జగ్గారెడ్డి పెద్దమ్మలొల్లతో కలిసి డ్యాన్స్​ చేస్తుండగా రాహుల్ కూడా ఆయనతో జత కలిసి చర్నకోల పట్టుకొని తనను తాను కొట్టుకుంటూ స్టెప్పులు వేయడంతో అక్కడంతా సందడిగా మారింది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జై కాంగ్రెస్​ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతకుముందు పోతిరెడ్డిపల్లిలో బ్రేక్​ఫాస్ట్ చేశాక రాహుల్ గిరిజనులతో కలిసి ధింసా నృత్యం చేశారు.

కాంగ్రెస్​ సీనియర్ల డ్యాన్స్​లు 

జోడో యాత్ర సభ వేదికపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్టెప్పులు వేసి కార్యకర్తలను ఉత్తేజపరిచారు. రాహుల్ ప్రసంగం ముగిశాక వీహెచ్ హన్మంతరావు, దామోదర్ రాజనర్సింహ్మ, ఆవుల రాజిరెడ్డి, మదన్​మోహన్​రావు తదితర సీనియర్లంతా జోడో జోడో అనే పాటకు డ్యాన్స్ చేశారు. స్టేజీపైన వారి డ్యాన్స్ కింద ఉన్న నాయకులు, కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపింది. జోడో యాత్రలో పీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, ఉత్తమ్​కుమార్​రెడ్డి, సీతక్క, షబ్బీర్​అలీ, సంపత్​కుమార్, కుసుమకుమార్​ పాల్గొన్నారు.