ప్రవల్లిక ఆత్మహత్య చాలా బాధాకరం.. రాహుల్ గాంధీ ట్వీట్

ప్రవల్లిక ఆత్మహత్య చాలా బాధాకరం.. రాహుల్ గాంధీ ట్వీట్

గ్రూప్ 2 వాయిదా పడటంతో మనస్తాపానికి గురై ప్రవల్లిక అనే  యువతి ఆత్మహత్య చేసుకున్న  ఘటన తనని కలిచివేసిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇది చాలా బాధకరమని,  విచారకరమని తెలిపారు. ఇది ఆత్మహత్య కాదన్న రాహుల్‌.. ముమ్మాటికి హత్యేనని ఆరోపించారు.  దీనిని యువత కలలు, వారి ఆశలు ,ఆకాంక్షలపై  జరిగిన హత్యగా రాహుల్ అభివర్ణించారు.  

తెలంగాణలోని యువత నేడు నిరుద్యోగంతో పూర్తిగా విలవిలలాడుతోందని రాహుల్ చెప్పారు. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్  తన  అసమర్థతతో రాష్ట్రాన్ని నాశనం చేసిందని విమర్శించారు.  తెలంగాణలోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక..  ఉద్యోగాల క్యాలెండర్‌ను విడుదల చేస్తామని తెలిపారు. మొదటి నెలలోనే యూపీఎస్సీ తరహాలో TSPSC పునర్వ్యవస్థీకరణ చేస్తామని స్పష్టం చేశారు. ఏడాదిలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.  

కాగా  వరంగల్ కు చెందిన విద్యార్థిని ప్రవల్లిక (25) హైదరాబాద్ అశోక్​నగర్​ లో ఉంటూ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతుంది.  అయితే తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో గ్రూప్ 2 వాయిదా పడటంతో మనస్తాపనికి గురైన ప్రవల్లిక  శుక్రవారం (అక్టోబర్ 13న) ఆత్మహత్య చేసుకుంది. ఆమె రాసిన సూసైడ్ నోట్ ను  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అశ్రునయనాల మధ్య ప్రవల్లిక అంత్యక్రియలు ఆమె స్వగ్రామంలో  ముగిశాయి.