నేషనల్ హైవేలను పట్టించుకుంటలే

నేషనల్ హైవేలను పట్టించుకుంటలే
  • కేంద్రం ఎందుకు పెట్టుబడులు పెట్టట్లే?  
  • ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు 
  • లోక్ సభలో ‘హైవేల పద్దు’పై రేవంత్  

న్యూఢిల్లీ, వెలుగు:  దేశ అభివృద్ధిలో రోడ్ల నిర్మాణం చాలా కీలకమని, కానీ ప్రధాని మోడీ సర్కారు రహదారుల నిర్వహణలో ఫెయిల్ అయిందని పీసీసీ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేల నిర్మాణానికి పెట్టుబడులు ఎందుకు పెట్టడంలేదని ఆయన ప్రశ్నించారు. బుధవారం లోక్ సభలో ‘రోడ్డు రవాణా, హైవేలకు సంబంధించిన పద్దులపై జరిగిన చర్చలో కాంగ్రెస్ తరఫున రేవంత్ మాట్లాడారు.  2014లో యూపీఏ 2 పదవీకాలం ముగిసేనాటికి నేషనల్ హైవేలపై రుణాలు రూ. 44 వేల కోట్లు ఉండేవని, ప్రస్తుతం 1300 శాతం పెరిగి రూ. 3.30 లక్షల కోట్లకు చేరాయన్నారు. దేశంలోని రోడ్లలో 2 శాతమే ఉన్న నేషనల్ హైవేలకు ఇంతపెద్ద మొత్తంలో అప్పులు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. దీనిపై కేంద్రం ఆలోచించుకోవాలని, ప్రభుత్వ పెట్టుబడులు పెట్టాలని కోరారు. ప్రపంచంలోని వాహనాల్లో ఒక శాతం వెహికల్సే మన దేశంలో ఉన్నాయని, కానీ యాక్సిడెంట్లు మాత్రం మన దేశంలోనే 11 శాతం జరుగుతున్నాయన్నారు. అందుకే హైవేలపై ఇన్వెస్ట్ మెంట్లపై ఆలోచించాలన్నారు. యూపీఏ హయాంలో 37 శాతం పెట్టుబడులు ఉండగా, ఇప్పుడు 7 శాతానికి పడిపోయాయని చెప్పారు. హామీలు నెరవేర్చడం కన్నా.. కేంద్ర సంస్థలను అమ్మేందుకే బీజేపీ సర్కార్ స్పీడ్ గా పని చేస్తోందని రేవంత్ విమర్శించారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, ఫ్లైట్లు, అన్నింటినీ అమ్మేసిందని, అన్ని రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులు వస్తున్నాయన్నారు. నేషనల్ హైవేల నిర్మాణంలో మాత్రం ప్రైవేటు పెట్టుబడులను అనుమతించడం లేదన్నారు. కేంద్ర సంస్థలను కొనుగోలు చేస్తోన్న బీజేపీ మిత్రులకు నేషనల్ హైవేల్లో పెట్టుబడులు పెట్టాలని ఎందుకు ఫోన్లు చేయడం లేదని ప్రశ్నించారు.   

 రోజుకు 68 కి.మీ. రోడ్లెయ్యాలె 

2023 మార్చి వరకు 25 వేల కి.మీ. నేషనల్ హైవేలు విస్తరిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారని రేవంత్ గుర్తు చేశారు. ఆ లెక్కన రోజూ 68 కి.మీ. హైవేలు నిర్మించాల్సి ఉంటుందని, కానీ.. 38 కి.మీ. మేరకే నిర్మాణం జరుగుతోందన్నారు. ఇట్లయితే టార్గెట్ చేరేందుకు మరో ఏడెనిమిదేండ్లు పడుతుందన్నారు. 2022 వరకు దేశంలో పేదలందరికీ ఇండ్లు ఇస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని కేంద్రం చెప్పిందని,  ఆ రెండూ జూమ్లా (అబద్ధం) అయ్యాయన్నారు. రోడ్ల విస్తరణ పేరుతో మూడో సారి జుమ్లా చేస్తారని విమర్శించారు. భారత్ మాల ప్రాజెక్ట్ లో 2021లోపు 34,800 కి.మీ. రోడ్లు నిర్మిస్తామని మోడీ చెప్పారని, కానీ, ఇప్పటి వరకు 7,375 కి. మీ. మాత్రమే నిర్మించారన్నారు. పనులు ఇట్లే సాగితే.. 2027 వరకు కూడా టార్గెట్ చేరుకోలేమన్నారు.  

2 కోట్ల ఉద్యోగాలు జుమ్లా 

ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని మోడీ చెప్పారని, ఈ లెక్కన ఎనిమిదేండ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందని రేవంత్ అన్నారు. నిజంగా ఇన్ని ఉద్యోగాలు ఇచ్చి ఉంటే తెలంగాణలో నిరుద్యోగులకు 50 లక్షల ఉద్యోగాలు వచ్చి ఉండేవన్నారు. కానీ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక్కరికే నౌకరీ దొరికిందన్నారు. హైవేస్ లో 40 శాతం ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని, ఆ శాఖను 60 శాతం స్టాఫ్​తోనే నడిపిస్తున్నారని చెప్పారు. సీజీఎం, డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయన్నారు. 

నీతి ఆయోగ్ నూ పట్టించుకోలే 

చివరకు నీతి ఆయోగ్ సూచనలనూ కేంద్రం పట్టించుకోవడం లేదని రేవంత్ ఆరోపించారు. రోడ్ల మెయింటెనెన్స్ కోసం10 శాతం బడ్జెట్ కేటాయించాలని 2018లోనే నీతి ఆయోగ్ సూచించినా అమలు చేయలేదని, కేవలం 1.3 శాతమే కేటాయించారన్నారు. అమెరికా వంటి దేశాల్లో రోడ్ల నిర్వహణ, రిపేర్లకు 50 శాతం కేటాయిస్తున్నారని చెప్పారు. నిరుడు రోడ్ల మెయింటెనెన్స్ కోసం రూ. 81 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు చెప్పారు. 

రైల్వే ప్రాజెక్టుల్లో రాష్ట్ర సర్కార్ రూ.699 కోట్లు బాకీ 

తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పార్టనర్ షిప్​లో రూ. 4,200 కోట్లతో 4 రైల్వే ప్రాజెక్టులు చేపడితే.. రాష్ట్ర ప్రభుత్వం రూ. 699 కోట్లు బకాయి పడ్డట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. బుధవారం లోక్ సభలో ఎంపీ రేవంత్‌‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఈ 4 ప్రాజెక్టుల్లో హైదరాబాద్‌‌ – సికింద్రాబాద్‌‌ ఎంఎంటీఎస్‌‌ ఫేజ్‌‌–2, భద్రాచలం రోడ్‌‌ – సత్తుపల్లి కొత్త లైన్, అక్కన్నపేట్‌‌ – మెదక్‌‌ కొత్త లైన్, మనోహరాబాద్‌‌ – కొత్తపల్లి కొత్త లైన్‌‌ ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈ రైల్వే ప్రాజెక్టుల వ్యయాన్ని పంచుకోనే దిశలో రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.