గిరిజనులను టీఆర్ఎస్, బీజేపీ కలిసి మోసం చేస్తున్నాయి

గిరిజనులను టీఆర్ఎస్, బీజేపీ కలిసి మోసం చేస్తున్నాయి

హైదరాబాద్, వెలుగు: గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ల హామీని ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసినందుకు సీఎం కేసీఆర్​ సారీ చెప్పాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్​కుమార్​ రెడ్డి అన్నారు. బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రానికి అన్ని విషయాల్లో మద్దతు ఇస్తున్న టీఆర్ఎస్​ గిరిజనులకు ఎందుకు రిజర్వేషన్లు సాధించలేక పోయిందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ గిరిజనులను టీఆర్ఎస్, బీజేపీ కలిసి మోసం చేస్తున్నాయన్నారు. తెలంగాణ ఎంపీలు ఏ రోజు కూడా గిరిజన రిజర్వేషన్ల అంశంపై స్పందించలేదన్నారు. ఏపీలో ట్రైబల్​ వర్సిటీ ఏర్పాటై పని చేస్తున్నదని.. తెలంగాణలో మాత్రం ఇంత వరకు ఆ ఊసేలేదన్నారు. గిరిజనుల రిజర్వేషన్లపై తాము పార్లమెంటులో ప్రశ్నిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనా రాలేదనే సమాధానమే వస్తున్నదన్నారు. గిరిజనులకు జనాభా ప్రాతిపదికగా తక్షణం రిజర్వేషన్లు ఇవ్వాలని ఉత్తమ్​ రాష్ట్ర సర్కార్​ను డిమాండ్​ చేశారు.