ఓయూలో రాహుల్ పర్యటన ఆగదు

ఓయూలో రాహుల్ పర్యటన ఆగదు

హైదరాబాద్: రాహుల్ ఓయూ పర్యటనను అడ్డుకోవడానికి రాష్ట్రం ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని, ఉస్మానియా యూనివర్సిటీని ఏమైనా కేసీఆర్ కట్టించాడా? అని  పీసీసీ మాజీ ప్రెసిడెంట్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. రాహుల్ ఓయూ సభకు పర్మిషన్ ఇవ్వడంలేదని ఎన్ఎస్యూఐ నేతలు మినిష్టర్స్ క్వార్టర్స్ ను ముట్టడికి ప్రయత్నించారు. దీంతో బంజరాహిల్స్ పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్ లో ఉంచారు. ఈ క్రమంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి వారిని విడిపించడానికి అక్కడికి వచ్చారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాహుల్ గాంధీని ఉస్మానియా యూనివర్సిటీకి రాకుండా కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారన్నారు. అందులో భాగంగానే రాహుల్ ఓయూ సందర్శనకు అనుమతి ఇవ్వడంలేదన్నారు. రాహుల్ సందర్శనకు ఏర్పాట్లు చేస్తున్న తమ నాయకులను, కార్యకర్తలను అక్రమంగా నిర్బంధించడం సరికాదన్నారు.

ఉస్మానియా యూనివర్సిటీని కేసీఆర్ ఏమైనా కట్టించాడా? లేక కాంగ్రెస్ ఏమైనా నిషేధిత సంస్థనా? అంటూ ఆయన ఫైర్ అయ్యారు. ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీలో సరైన వసతులు లేక... విద్యా వ్యవస్థ అధ్వానంగా మారిందన్నారు. క్యాంపస్ లో నెలకొన్న సమస్యల గురించి విద్యార్థులతో మాట్లాడటానికి రాహుల్ వస్తుంటే... రాష్ట్ర ప్రభుత్వానికి ఏం ఇబ్బంది కలుగుతోందని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ఓ ముఖ్య నేతగా ఉన్నారన్న ఆయన.... ఒక ఎంపీగా రాహుల్ గాంధీకి దేశంలో ఎక్కడైనా పర్యటించే అధికారం ఉందన్నారు. రాష్ట్రంలో నిర్బంధ పాలన నడుస్తోందని ఆయన.... విద్యార్థులే కేసీఆర్ కు గుణపాఠం చెబుతారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఓయూలో రాహుల్ పర్యటనను విజయవంతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తల కోసం...

బండి సంజయ్కి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ

రాహుల్ ఓయూలోకి వచ్చేందుకు పర్మీషన్ ఇవ్వాల్సిందే