- కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, అశ్వినీ వైష్ణవ్‌కు కాంగ్రెస్ ఎంపీల వినతి
- ట్రిపుల్ ఆర్‌కు త్వరితగతిన ఆమోదానికి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తులు
- కేంద్ర మంత్రులతో ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, సురేశ్ షెట్కార్, చామల భేటీ
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలతోపాటు మౌలిక వసతుల కల్పన, ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులతో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్ మల్లు రవి నేతృత్వంలో ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, సురేశ్ షెట్కార్, చామల కిరణ్‌కుమార్ రెడ్డి వరుసగా భేటీ అయ్యారు. తొలుత కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని వినతి పత్రం సమర్పించారు.
అనంతరం కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. రీజినల్ రింగ్ రోడ్, శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌ను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిసి.. రైల్వే ప్రాజెక్టులు స్పీడప్ చేయాలని రిక్వెస్ట్ చేశారు.
శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ను మంజూరు చేయండి..
తెలంగాణలో వేగంగా పెరుగుతున్న పారిశ్రామిక, రవాణా అవసరాలకు తగ్గట్టుగా కీలక నేషనల్ హైవే ప్రాజెక్టులు, ట్రిపుల్ ఆర్, శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులను సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీలు వినతిపత్రాలు అందజేశారు. ప్రధానంగా హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ ఆర్) ఉత్తర భాగానికి (ఎన్ హెచ్–161ఏఏ) సంబంధించి 95% భూసేకరణ పూర్తయిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 626 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. అయినప్పటికీ.. టెండర్లు నిలిచిపోయినందున కేంద్ర కేబినెట్ ఆమోదం త్వరగా లభించేలా చొరవ చూపాలని అభ్యర్థించారు. దక్షిణ భాగానికి సంబంధించి చౌటుప్పల్, ఆమన్‌గల్, షాద్‌నగర్ మీదుగా రీజినల్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను కూడా వెంటనే ఆమోదించాలని కోరారు. దీంతో పాటు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 లో పొందుపరిచిన విధంగా హైదరాబాద్ (భారత్ ఫ్యూచర్ సిటీ) నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం (బందర్) పోర్టు వరకు 12 లేన్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణాన్ని మంజూరు చేయాలని రిక్వెస్ట్ చేశారు.
కీలకమైన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మన్ననూర్– శ్రీశైలం వరకు ఎన్‌హెచ్ –765 పై 4-లేన్ ఎలివేటెడ్ కారిడార్‌ను తక్షణమే మంజూరు చేయాలన్నారు. కేవలం 2- లేన్ కారిడార్‌ను నిర్మించడం వల్ల అది భవిష్యత్ అవసరాలకు సరిపోదని కేంద్ర మంత్రికి వివరించారు. అందువల్ల 4- లేన్ల నిర్మాణం చేపట్టాలని, తద్వారా హైదరాబాద్ నుంచి శ్రీశైలం క్షేత్రానికి అంతరాయం లేని ప్రయాణ సౌకర్యం కలుగుతుందన్నారు.
రైల్వే ప్రాజెక్టులను స్పీడప్ చేయండి
కేంద్ర బడ్జెట్ 2026లో ప్రకటించిన హైదరాబాద్–-ముంబై, హైదరాబాద్-–బెంగళూరు, హైదరాబాద్–-చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్లకు సంబంధించి డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధం చేయాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ఎంపీలు కోరారు. హైదరాబాద్ చుట్టూ ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన 362 కిలో మీటర్ల రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్టు, డోర్నకల్– - గద్వాల (296 కిలో మీటర్లు), మలకలపల్లి/కల్వకుర్తి - –మాచర్ల (126 కిలో మీటర్లు) రైల్వే లైన్లను 100% కేంద్ర సాయంతో పూర్తి చేయాలని రిక్వెస్ట్ చేశారు.
ముఖ్యంగా వికారాబాద్ -– కృష్ణా నూతన రైల్వే లైన్ (130 కిలో మీటర్లు, రూ. 2,750 కోట్లు) భూసేకరణ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, కాబట్టి ఈ నిర్మాణాన్ని 100% కేంద్ర రైల్వేల నిధులతో చేపట్టాలని అభ్యర్థించారు. తెలంగాణ డ్రై పోర్ట్ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం (బందర్) పోర్టును అనుసంధానించే హరిత కారిడార్ ఫ్రైట్ ప్రాజెక్టును గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు.
బోధన్–-లాతూర్, పటాన్‌చెరు-–ఆదిలాబాద్, కాచిగూడ–-జగ్గయ్యపేట మార్గాల్లో సర్వేలను త్వరగా పూర్తి చేసి.. పనులు ప్రారంభించాలని లేఖ ద్వారా మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ కీలకమైన రైల్వే ప్రాజెక్టులను వెంటనే మంజూరు చేసి, వేగవంతం చేయడం ద్వారా.. వికసిత్ భారత్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు మార్గం సుగమం అవుతుందని వివరించారు.
హైదరాబాద్- చెన్నై బుల్లెట్ రైలు కారిడార్‌లో నకిరేకల్ ను చేర్చండి
ప్రతిపాదిత హైదరాబాద్–చెన్నై హై-స్పీడ్ రైలు (బుల్లెట్ రైలు) కారిడార్‌లో నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని కూడా చేర్చే విషయాన్ని పరిశీలించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. బుధవారం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో భేటీలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ధాన్యం సేకరణలో తెలంగాణ సరికొత్త రిక్డార్డు
2025–26 కేఎంఎస్ సీజన్‌లో ధాన్యం సేకరణలో తెలంగాణ సరికొత్త రిక్డార్డును సృష్టించిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి దృష్టికి ఎంపీలు తీసుకెళ్లారు. 153 లక్షల టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యం సేకరించినట్టు చెప్పారు. రాబోయే వానాకాలం 2026–27 సేకరణకు మిల్లుల్లో స్థలం ఖాళీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘మిషన్– కే-100’ పేరిట 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ద్వారా నెలకు 10 ఎల్‌ఎమ్‌టీల చొప్పున సీఎంఆర్ పంపేలా ప్రణాళికలు రూపొందించిందని వివరించారు.
అయితే, రాష్ట్రంలో ఎఫ్‌సీఐ వద్ద ఉన్న 24.42 ఎల్‌ఎమ్‌టీల నిల్వ సామర్థ్యంలో ఇప్పటికే 22.40 ఎల్‌ఎమ్‌టీల బియ్యం నిండిపోయి ఉండటంతో.. కేవలం 2.02 ఎల్‌ఎమ్‌టీల ఖాళీ మాత్రమే ఉందన్నారు. గోదాముల కొరతతో మిల్లుల నుంచి బియ్యం స్వీకరణ నిలిచిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, ఆగస్టు నెలకుగానూ కేవలం 67 రైల్వే రేక్‌లు మాత్రమే కేటాయించారని, ఇది రాష్ట్ర అవసరాలకు సరిపోదని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి బియ్యం తరలింపునకు ప్రతినెలా కనీసం 200 రైల్వే రేక్‌లను కేటాయించాలని కోరారు. తెలంగాణలో రికార్డు స్థాయిలో సేకరించిన ధాన్యాన్ని గడువులోగా కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) రూపంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు అప్పగించేందుకు వీలుగా మౌలిక వసతులు కల్పించాలని అభ్యర్థించారు. బియ్యం సేకరణ వేగవంతం చేసేందుకు ఎఫ్‌సీఐ ద్వారా అదనపు గోదాములను అద్దెకు తీసుకోవాలని కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు.
