- తాజాగా డీసీసీ, ఆత్మ చైర్మన్ల నియామకాలు
- ఇటీవలే ముగిసిన డీసీసీబీ అధ్యక్షుల పదవీకాలం
- సంక్రాంతి తర్వాత కాంగ్రెస్లో పదవుల పండుగ
- పైరవీలు చేసుకుంటున్న ఆశావహులుః
ఆదిలాబాద్, వెలుగు: నామినేటెడ్ పోస్టులపై కాంగ్రెస్ నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టులు కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో పార్టీలో ఆశావహులు పైరవీలు మొదలుపెట్టారు. ఇటీవల ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా నరేశ్ జాదవ్ ను నియమించగా, తాజాగా జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత గిమ్మ సంతోష్ ను జిల్లా ఆత్మ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నప్పటికీ ఇంకా చాలా పోస్టులు ఖాళీగా ఉండటంతో వాటిపై హైకమాండ్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ సంక్రాంతి తర్వాత కాంగ్రెస్ లో పదవుల పండుగ మొదలు కానుంది. జిల్లా, రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పదవులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండటంతో ఈ సారి పదవులు ఎవరికి వరిస్తాయోనని ఉత్కంఠ నెలకొంది. దీంతో ఇప్పటి నుంచే పదవులపై నేతలు లెక్కలేసుకుంటున్నారు.
మార్కెట్ కమిటీ, సహకార సంఘాలు, డీసీసీబీ డైరెక్టర్, విజయ డైరీ, డీసీసీబీ..
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పదవుల్లో ఏదో ఒకటి దక్కించుకోవాలనే కొంతమంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా సీనియర్లు పదవుల కోసం పైస్థాయిలో పైరవీలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జిల్లా స్థాయిలో పార్టీలో అధ్యక్ష పదవి భర్తీ కాగా.. ఇంకా మార్కెట్ కమిటీ, సహకార సంఘాలు, డీసీసీబీ డైరెక్టర్, విజయ డైరీ, డీసీసీబీ, డీసీఎంఎస్, సహకార చైర్మన్ పదవులను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలోనే ఆ స్థానాల కోసం పోటీ కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మంచి ఫలితాలు రావడంతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నేతలకు పదవులు కల్పించే విషయంలో హైకమాండ్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.
ఆదిలాబాద్ డెవలప్ మెంట్ అథారిటీని(ఔడా) చైర్మన్, ఐటీడీఏ పరిధిలో వచ్చే ఆదిమ గిరిజన సంక్షేమ సలహా మండలి(ఏటీడబ్ల్యూఏసీ) చైర్మన్‌ను నియమించేందుకు సర్కారు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లినట్లు నేతలు చెబుతున్నారు. దేవాలయాల పాలక మండళ్ల పదవులు కూడా నియమించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. దీంతో పెద్దమొత్తంలో కాంగ్రెస్ నేతలకు పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయి.
డీసీసీబీపైన అందరి దృష్టి
జిల్లాల విభజన జరిగినప్పటికీ డీసీసీబీ పదవి మాత్రం ఒక్కటే కొనసాగుతోంది. డీసీసీబీ పాలకవర్గం ముగిసినప్పటికీ రెండు సార్లు పొడగించిన ప్రభుత్వం తాజాగా మూడోసారి ప్రత్యేక అధికారులకు అప్పగించింది. ఇటీవల కలెక్టర్ రాజర్షి షా స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించారు.
అయితే డీసీసీబీ పాలకవర్గం నియామకంలో ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పద్ధతిలో నియమించే అవకాశంఉంది. కాగా ఉమ్మడి జిల్లాలకు డీసీసీబీని రెండుగా విభజించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై సైతం ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. డీసీసీబీలో పెద్దఎత్తున పదవులు వచ్చే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చాలా మంది నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూస్తుండగా రెండేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో పదవుల పంపకాలు జరుగనున్నాయి.
