కాంగ్రెస్​ను హిందూ వ్యతిరేక పార్టీగా చిత్రీకరిస్తున్నరు: విజయశాంతి

కాంగ్రెస్​ను హిందూ వ్యతిరేక పార్టీగా చిత్రీకరిస్తున్నరు: విజయశాంతి

హైదరాబాద్, వెలుగు: అయోధ్య అంశాన్ని చూపుతూ కాంగ్రెస్​ను హిందూ వ్యతిరేక పార్టీగా కొందరు చిత్రీకరిస్తున్నరని ఆ పార్టీ​నేత విజయశాంతి మండిపడ్డారు. సెక్యులరిజమంటే ఏ మతానికీ వ్యతిరేకం కాదని, సర్వమత సహనమని ఆమె తెలిపారు. మంగళవారం ఈ మేరకు ట్వీట్​ చేశారు. ‘‘హిందువుల్లో ఎక్కువ శాతం మంది ఎంతో అభిమానంతో కాంగ్రెస్​ను గెలిపించారు. ఆ విషయాన్ని విమర్శకులు యాది ఉంచుకోవాలి. అయోధ్య రాముడిని దేశంలోని విశ్వాసమున్న హిందువులంతా కొలుస్తారు. 

అయితే, అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఓ రాజకీయ పార్టీకి చెందిన కార్యక్రమంగా నిర్వహిస్తుండడంతో శివసేన, తృణమూల్​కాంగ్రెస్​ వంటి పార్టీలు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించాయి. మిగతా పార్టీల్లోని హిందూ నేతలెవరైనా ఆ రోజున కార్యక్రమంలో పాల్గొనలేకపోతే.. ఆ అంశాన్ని రాజకీయపరంగా చూపించే అవకాశం ఉంది. అలా చూపిస్తే వారిదే తప్పు అవుతుంది .. పాల్గొనలేని భక్తులు, వ్యక్తుల తప్పు ఎంత మాత్రం కాదు. సుప్రీం కోర్టు తీర్పుతోనే అయోధ్యలో మందిర నిర్మాణం జరిగిందే తప్ప.. ఏ ఒక్కరి సొంత ఘనతతో కాదు’’ అని ఆమె ట్వీట్​లో పేర్కొన్నారు.