కాంగ్రెస్ ఖాతాలు ఫ్రీజ్

కాంగ్రెస్ ఖాతాలు ఫ్రీజ్
  •  ఐటీ శాఖ నిర్ణయం..  ట్రిబ్యునల్ ఆదేశాలతో మళ్లీ డీఫ్రీజ్
  • కనీసం రూ. 115 కోట్లు ఖాతాల్లో ఉంచాలంటూ ఆదేశం 
  • విచారణ వచ్చే వారానికి వాయిదా
  • ఎన్నికలకు ముందు ఖాతాలు ఫ్రీజ్ చేస్తరా? 
  • ఇది ప్రజాస్వామ్యంపై దాడే: ఖర్గే, రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ పార్టీ మెయిన్ బ్యాంక్ అకౌంట్లను ఇన్​కం ట్యాక్స్ డిపార్ట్​మెంట్ శుక్రవారం స్తంభింపచేయడంతో పెను దుమారం రేగింది. కేంద్రంలోని బీజేపీ సర్కారు లోక్ సభ ఎన్నికలకు ముందు తమను ఇరకాటంలో పెట్టేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. అయితే, ఖాతాలను ఫ్రీజ్ చేసిన వెంటనే.. ఐటీ అప్పీలేట్ ట్రిబ్యునల్​ను పార్టీ ఆశ్రయించడంతో ఆ ఖాతాలను డీఫ్రీజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనిపై శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్  ట్రెజరర్  అజయ్ మాకెన్ స్పందిస్తూ.. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ కు ముందు ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ అకౌంట్ల ఫ్రీజ్ జరిగిందన్నారు.

 2018–19 ఎన్నికల ఏడాదిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ జీతాల్లోంచి పార్టీకి రూ. 14.4 లక్షల విరాళాలు ఇచ్చారని, ఈ విరాళాలకు సంబంధించిన ట్యాక్స్ రికవరీ కోసం ఐటీ శాఖ రూ. 210 కోట్ల జరిమానా విధించిందన్నారు. అయితే, పార్టీ ఖాతాల్లో కనీసం రూ. 115 కోట్లు ఉంచాలని, అంతకంటే ఎక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని వినియోగించుకోవచ్చని ట్రిబ్యునల్ ఆదేశించింది. వచ్చే బుధవారం దీనిపై తదుపరి విచారణ చేపడతామంటూ స్పష్టం చేసింది. కాగా, పార్టీకి చెందిన 4 అకౌంట్లు ఫ్రీజ్ అయ్యాయని మాకెన్ ప్రకటించగా, మొత్తం 9 అకౌంట్లు ఫ్రీజ్ అయ్యాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి.  

కాంగ్రెస్ నేతల మండిపాటు 

కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై తీవ్రమైన దాడి అని అన్నారు. అధికార దాహంలో ఉన్న ప్రధాని మోదీ సర్కార్ లోక్ సభ ఎన్నికల ముందు దేశంలోని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ ఖాతాలను స్తంభింపజేసిందని ఫైర్ అయ్యారు. ‘‘రాజ్యాంగ విరుద్ధంగా సేకరించిన డబ్బును బీజేపీ ఎన్నికల్లో ఖర్చు చేస్తోంది. మేం క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించిన నిధుల్ని మాత్రం ఫ్రీజ్ చేశారు” అని ఖర్గే విమర్శించారు. మోదీ మూడోసారి గెలిస్తే దేశంలో ప్రజాస్వామ్యం అంతం అవుతుందని, భవిష్యత్తులో ఇక ఎన్నికలు ఉండబోవన్నారు. 

కాంగ్రెస్ పార్టీకి ధన బలం కాదని.. ప్రజా బలం ఉందని ఆ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. నియంతృత్వంతో బెదిరింపులకు పాల్పడితే కాంగ్రెస్ లొంగదన్నారు. లోక్ సభ ఎన్నికలకు ముందు, ప్రతిపక్ష పార్టీ ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేపట్టకుండా చేయాలనే బీజేపీ ఈ చర్యలను ఎంచుకుందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ(సంస్థాగత) కేసీ వేణుగోపాల్ విమర్శించారు. బీజేపీ మాత్రం అక్రమంగా ఎలక్టోరల్ బాండ్ స్కాం ద్వారా రూ.6,500 కోట్లు సేకరించి, తన ఖాతాల్లో వేసుకుందన్నారు.