రియల్టర్లు, లీడర్ల చేతుల్లోనే 80% భూములు.. కాంగ్రెస్​ పరిశీలనలో వెల్లడి

రియల్టర్లు, లీడర్ల చేతుల్లోనే 80%  భూములు.. కాంగ్రెస్​ పరిశీలనలో వెల్లడి
  • జీవోను ఎత్తేసినా, ఉంచినా ఒరిగేదేమీ లేదన్న 40% మంది రైతులు
  • ఎత్తేస్తే తమ ల్యాండ్స్​కు ధరలు పెరుగుతాయన్న 50% మంది
  • జీవో ఉంటేనే.. మంచిగాలి పీల్చుకుంటున్నామన్న 10 శాతం మంది
  • ఎఫ్​టీఎల్​ లోపల ఉన్న అక్రమ నిర్మాణాలు, ఫామ్​హౌస్​లను తొలగించాలని కాంగ్రెస్​ డిమాండ్​

హైదరాబాద్, వెలుగు:  111 జీవో పరిధిలోని 80 శాతం భూములు రియల్​ ఎస్టేట్​ వ్యాపారులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, ప్రభుత్వాధికారుల చేతుల్లోనే ఉన్నాయి. కేవలం 20 శాతం భూములే రైతుల వద్ద ఉన్నాయి. ఇది కాంగ్రెస్​ పార్టీ క్షేత్రస్థాయిలో చేసిన పరిశీలనలో వెల్లడైంది. దానికి సంబంధించిన నివేదికను బుధవారం కాంగ్రెస్​ కిసాన్​ సెల్​ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి విడుదల చేశారు. 111 జీవో పరిధిలో 1.3 లక్షల ఎకరాల భూములుంటే, అందులో 30 వేల ఎకరాల అసైన్డ్​ భూములను పేదలకు కాంగ్రెస్​ హయాంలో పంచినట్లు రిపోర్ట్​లో పేర్కొన్నారు. ఇప్పుడు ఆ అసైన్డ్​ భూములు కూడా వ్యాపారులు, పెద్దల చేతుల్లోకి వెళ్లిపోయాయని తెలిపారు. మొత్తంగా జీవో పరిధిలోని భూముల్లో 80% వరకు బడాబాబుల చేతుల్లోనే ఉన్నట్లు కాంగ్రెస్​ పరిశీలనతో తేలింది. 

111 జీవోపై రైతులు ఏమన్నారంటే..!

హైదరాబాద్​లోని జంట జలాశయాల పరిరక్షణ కోసం ఉమ్మడి ఏపీలో 111 జీవోను తీసుకువచ్చారు. ఈ జీవోను ఎత్తివేస్తున్నట్లు ఈ మధ్య ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. జీవోను ఉంచినా, ఎత్తేసినా తమకు ఒరిగింది, ఒరిగేది ఏమీ లేదని 40 శాతం మంది రైతులు కాంగ్రెస్​ పరిశీలనలో అభిప్రాయపడ్డారు. తమ భూమిలోనే వ్యవసాయం చేసుకుని బతుకుతామని తేల్చిచెప్పారు. 


మరో 10 శాతం మంది రైతులు అసలు దానిని ఎత్తేయొద్దన్నారు. ఇప్పుడే మంచి గాలి పీల్చి.. పంటలు పండించుకుంటున్నామని, ఇప్పుడున్నట్టుంటేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. తమ పంటలకు మంచి ధర ఇస్తే చాలని అన్నారు. మరో సగం మంది రైతులు మాత్రం తమ పక్కనే ఉండే భూములు రూ. కోట్లు పలుకుతుంటే.. తమవి మాత్రం తక్కువ పలుకుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీవోను ఎత్తేస్తే తమ భూముల ధరలు కూడా పెరుగుతాయని, పిల్లల చదువులు, పెండ్లిళ్లకు ఉపయోగపడతాయని ఆశించారు. ప్రస్తుతం వస్తున్న ఆదాయం సరిపోవడం లేదంటున్నారు. 

రైతులను ప్రభుత్వాలు పట్టించుకోలే 

111 జీవోను తీసుకొచ్చేటప్పుడుగానీ, ఇప్పుడు ఎత్తేసేటప్పుడుగానీ ప్రభుత్వాలు రైతుల గురించి పట్టించుకోలేదని కాంగ్రెస్​ రిపోర్ట్​లో పేర్కొంది. 1996లో నాటి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసంగానీ, ఆర్థిక వనరులను పెంచేందుకుగానీ ఆలోచించలేదని తెలిపింది. ఇప్పుడు జీవోను ఎత్తేసే సందర్భంలో బీఆర్​ఎస్​ సర్కార్​ కూడా రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఎలాంటి హామీలనూ ఇవ్వలేదని పేర్కొంది. ఇప్పటికైనా అక్కడ వ్యవసాయం చేస్తున్న రైతులను గుర్తించాలని సూచించింది. ‘‘ఈ ప్రాంత రైతులకు ప్రత్యేక ప్యాకేజీ కింద ఏటా ఎకరానికి రూ. లక్ష చొప్పున రెండు విడతలుగా ఆర్థిక సాయం చేయాలి. ప్రకృతి వ్యవసాయ పంటలు పండించేలా ప్రోత్సహించాలి. హార్టికల్చర్​, పరిశోధనశాలను ఏర్పాటు చేసి శిక్షణనివ్వాలి. రైతులకు మంచి ధర వచ్చేలా మార్కెటింగ్​ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. 111 జీవో పరిధిని ప్రకృతి వ్యవసాయ జోన్​గా ప్రకటించాలి. ఆ రైతులకు గుర్తింపు కార్డులివ్వాలి. ఎఫ్​టీఎల్​ లోపల ఉన్న అక్రమ నిర్మాణాలు, ఫామ్​హౌస్​లను తొలగించాలి. టూరిస్ట్​ ప్రాంతంగా అభివృద్ధి చేయాలి. సమగ్రమైన చట్టం తేవాలి’’ అని రిపోర్ట్​లో పేర్కొంది. 

రియల్టర్ల కోసమే 111 జీవో ఎత్తేశారు: కోదండ రెడ్డి

పర్యావరణంపై సీఎం కేసీఆర్​కు అవగాహనే లేదని కాంగ్రెస్​ కిసాన్​ సెల్​ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. జంట జలాశయాలు ఎందుకు కట్టారో కూడా బీఆర్​ఎస్​ నేతలకు తెలియదని విమర్శించారు. గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడుతూ.. మంత్రులు హరీశ్​రావుతో పాటు మాజీ మంత్రి మహేందర్​ రెడ్డి ఫాంహౌస్​లు ఎఫ్​టీఎల్​ పరిధిలోనే ఉన్నాయని, వారి ఫాంహౌస్​లు మునగకుండా ఉండేందుకు జంట జలశయాలు నిండకపోయినా నీటిని కిందికి వదులుతు న్నారని ఆయన ఆరోపించారు. రియల్టర్ల కోసమే 111జీవోను ఎత్తేశారని దుయ్యబట్టారు.   ‘‘111జీవో పరిధిలో సామాన్యులకు ఎన్నో షరతులు పెట్టిన సర్కారు.. పెద్దలు ఇష్టారీతిలో ఇండ్లను కడుతున్నా   పట్టించుకోలేదు” అని కోదండరెడ్డి ఫైర్​ అయ్యారు.