అదానీ, అంబానీల కోసమే రైతులను ముంచే చట్టం తెచ్చారు

అదానీ, అంబానీల కోసమే రైతులను ముంచే చట్టం తెచ్చారు

జగిత్యాల జిల్లా: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టంతో కనీస మద్ధతు ధరకు రక్షణ లేకుండా పోయిందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఫ్రీ ట్రేడింగ్ నెపంతో రైతులను నిండా ముంచేలా కొత్త వ్యవసాయం చట్టం తయారు చేశార‌ని ఆయ‌న అన్నారు. భారత్ బంద్ కు సహకరించాలని కోరుతూ జగిత్యాలలో కాంగ్రెస్ బైక్ ర్యాలీ నిర్వ‌హించింది. ఈ ర్యాలీలో పాల్గొన్న జీవ‌న్ రెడ్డి.. అనంత‌రం ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగల్లాగా రైతులను ఇబ్బందికి గురి చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నూతన వ్యవసాయ బిల్లులు వ్యతిరేకంగా అసెంబ్లీలో కేసీఆర్ ముఖ్యమంత్రి తీర్మానం ఎందుకు చేయలేదని జీవ‌న్ రెడ్డి ఈ సంద‌ర్భంగా ప్ర‌శ్నించారు.

అదానీ, అంబానీ లకోసమే కోసం రైతులను ముంచే చట్టం తెచ్చారని, వ్యవసాయ చట్టం వెనక్కి తీసుకోవాలని రేపు రాజకీయాలకతీతంగా అందరూ బంద్ లో పాల్గొనాలన్నారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకే టీఆర్ఎస్ రేపటి బంద్ కు మద్ధతునిస్తోంద‌న్నారు. నిజంగా మీకు రైతుల పట్ల చిత్త శుద్ధి ఉంటే అకాల వర్షాలు, దోమపోటు తో నష్టపోయిన తెలంగాణ రైతులను ఆదుకోవాలన్నారు. వరద బాధితులకు 10 వేల రూపాలు ఇచ్చి ఆదుకున్నట్లుగానే రైతులను ఆదుకోవాలని అన్నారు