కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల నుంచి ..రూ.65 కోట్లు బదిలీ

కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల నుంచి ..రూ.65 కోట్లు బదిలీ
  •     ఐటీపై అజయ్ మాకెన్ ఆరోపణలు
  •     ఇది ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నమని ఆరోపణ 

న్యూఢిల్లీ :  తమ పార్టీకి చెందిన బ్యాంక్ అకౌంట్ల నుంచి 65 కోట్ల రూపాయలను ఇన్ కమ్ ట్యాక్స్ (ఐటీ) ఆఫీసర్లు అక్రమంగా బదిలీ చేశారని కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ అజయ్ మాకెన్ ఆరోపించారు.  ఏజెన్సీలు ఇలాగే పనిచేస్తే దేశంలో ప్రజాస్వామ్యం అంతమవుతుందన్నారు. బుధవారం అజయ్ మాకెన్ ట్విట్టర్​లో ఐటీ శాఖ తీరుపై మండిపడ్డారు. అనుమతిలేకుండా కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్​ల ఖాతాల్లోంచి రూ.65 కోట్లు ఎలా  ట్రాన్స్​ఫర్​ చేస్తారని ఫైర్ అయ్యారు. ‘కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను ఐటీ అఫీసర్లు ఫ్రీజ్ చేశారు. తాము జారీచేసిన చెక్కులు చెల్లడంలేదు. గత పన్ను రిటర్న్‌‌లలో వ్యత్యాసాల కారణంగా యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ తమకు రికవరీగా 210 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆదాయపు పన్నుశాఖ కోరింది. క్రౌడ్ ఫండింగ్ ద్వారా  కాంగ్రెస్ సేకరించిన ఖాతాలను ఫ్రీజ్ చేసింది’ అని అజయ్ మాకెన్ తెలిపారు.

రికవరీ నోటీసుపై స్టే ఉన్నా..

ఖాతాలను ఐటీ ఆఫీసర్లు ఫ్రీజ్ చేయడంపై తాము  ఐటీ అప్పీలేట్ అథారిటీలో ఫిర్యాదు చేశామని మాకెన్ తెలిపారు. దీంతో రికవరీ నోటీసుపై ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చిందన్నారు. ‘కేసు ఇంకా విచారణలో ఉంది. అయితే, కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్‌‌ల వేర్వేరు బ్యాంకు ఖాతాల నుంచి రూ.65 కోట్లు ట్రాన్స్​ఫర్​ చేయాలని ఐటీ ఆఫీసర్లు అన్ని బ్యాంకులకు లేఖలు రాశారు. ఇది పూర్తిగా అప్రజాస్వామిక చర్య. ఇలాంటి చర్యలు  ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగిస్తాయి. న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోకపోతే మన ప్రజాస్వామ్య సూత్రాలు ప్రమాదంలో పడతాయి. న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి విశ్వాసం ఉంది"  అని మాకెన్ చెప్పారు. ఐటీ ట్రిబ్యునల్‌‌లో కేసు విచారణలో ఉన్నందున తమ ఖాతాల నుంచి ఎలాంటి మొత్తాన్ని విత్‌‌డ్రా చేయొద్దని బ్యాంకులకు కాంగ్రెస్ లెటర్ ద్వారా విజ్ఞప్తి చేసింది.