పార్టీ పనులకు ప్రభుత్వ అధికారులా? : మల్లికార్జున ఖర్గే

పార్టీ పనులకు ప్రభుత్వ అధికారులా? : మల్లికార్జున ఖర్గే
  • రథ్​ ప్రభారీలు’గా నియమించడం సరికాదు: ఖర్గే

న్యూ‌‌‌‌ఢిల్లీ: పార్టీ కార్యక్రమాలకు గవర్నమెంట్ ఆఫీసర్లను వాడుకోవడం ఏంటని ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్, డిప్యూటీ సెక్రటరీ ర్యాంకు అధికారులను ‘రథ్ ప్రభారీలు’గా నియమించడం ఏంటని ఫైర్ అయ్యారు. ఇలా ప్రభుత్వ అధికారులను పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకోవడం తాను ఎక్కడా చూడలేదంటూ ఆదివారం ప్రధాని మోదీకి రాసిన లేఖలో మల్లికార్జున ఖర్గే ప్రస్తావించారు. గవర్నమెంట్ ఆఫీసర్లు రథ్ ప్రభారీలుగా వ్యవహరించాలంటూ అక్టోబర్ 18న జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 

తొమ్మిదేండ్ల ఎన్​డీఏ పాలనలో సాధించిన విజయాలను ప్రదర్శించాలంటూ అధికారులను ఆదేశించడం సరికాదన్నారు. ఇది ముమ్మాటికీ అధికార యంత్రాంగాన్ని రాజకీయం చేయడమే అవుతుందని విమర్శించారు. దేశంలోని 765 జిల్లాలకు గవర్నమెంట్ అధికారులను రథ్ ప్రభారీలుగా నియమించడాన్ని ఖండించారు. ఇది సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (కండక్ట్) రూల్స్, 1964ను ఉల్లంఘించడమేనని అన్నారు..

ఐదు రాష్ట్రాల్లో మాదే విజయం

ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్​కు అనుకూల వాతావరణం ఉందని పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నారు. మేము 5, బీజేపీ 0 పరిస్థితి ఉందని ఖర్గే తెలిపారు. ఎంత ప్రయత్నించినా అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు. మధ్యప్రదేశ్​కు వెళ్లి మోదీకి ఓటేయాలని ప్రధాని ప్రచారం చేయడం నవ్వు తెప్పిస్తోందని విమర్శించారు. పార్టీ పేరు కానీ, సీఎం పేరు కానీ మోదీ ప్రస్తావించలేదన్నారు.