
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ముందు హాజరుకానున్నారు. నగదు అక్రమ చలామణికి సంబంధించిన కేసులో దర్యాప్తు సంస్థ ఈడీ సోనియాను ప్రశ్నించనుండడం ఇది రెండోసారి. కాంగ్రెస్ పై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆ పార్టీ నాయకులు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా మహాత్మాగాంధీ విగ్రహల దగ్గర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయం దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రాజ్ ఘాట్ వద్ద కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష చేపట్టేందుకు ఢిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. సోనియాగాంధీ నివాసం 10 జనపథ్ పక్కనే ఉన్న కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలిరావాలని ఆ పార్టీ పెద్దలు ఆదేశించారు.
పోలీసుల ఆంక్షలు
ప్రస్తుతం ఏఐసీసీ కార్యాలయం వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోనియా గాంధీ ఈడీ విచారణ నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈడీ విచారణను నిరసిస్తూ దేశవ్యాప్త ప్రదర్శనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈడీ విచారణ సందర్భంగా ఏఐసీసీ వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరాకుండా అక్బర్ రోడ్‌లో 3 వరుసలుగా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు ఆందోళనలు ఉధృతంగా కాకుండా వాటర్ కెనాన్లను పోలీసులు సిద్ధంగా ఉంచారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ ఆంక్షలు విధించారు. కాంగ్రెస్ కార్యకర్తలు గుమికూడకుండా నిషేధాజ్ఞలు విధించారు.
Heavy security deployment near Congress office in Delhi. Party's interim president Sonia Gandhi will appear before the ED for the second day today, in connection with the National Herald case. pic.twitter.com/KTaS39dzi8
— ANI (@ANI) July 26, 2022
జులై 21న 2 గంటల పాటు విచారణ
నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి జులై 21న ఈడీ అధికారులు సోనియాగాంధీని దాదాపు రెండు గంటల పాటు ప్రశ్నించారు. గత నెల జూన్‌లో రాహుల్ గాంధీని సుమారు 50 గంటల పాటు ప్రశ్నించారు. అప్పుడు కూడా కాంగ్రెస్ వరుసగా 5 రోజుల పాటు నిరసన ప్రదర్శన చేపట్టింది. మోడీ ప్రభుత్వం కావాలనే సోనియాగాంధీపై ఇలా చేస్తోందని ఆరోపించారు.