
- కాంగ్రెస్ లో ప్రతీ సెగ్మెంట్ కు ముగ్గురి చొప్పున ప్రతిపాదన
- ఎమ్మెల్యేల ప్రతిపాదిత లిస్ట్ ను పీసీసీకి పంపనున్న డీసీసీ
- లోకల్ సర్వేల తర్వాతే ఫైనల్ అభ్యర్థి ప్రకటన
- బీఆర్ఎస్లోనూ క్యాండిడేట్ల సెలక్షన్ప్రాసెస్స్టార్ట్
ఖమ్మం, వెలుగు : స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీల కసరత్తు కొనసాగుతోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లలో గెలుపు గుర్రాలను ఎంపిక చేయడంపై ముఖ్య నేతలు దృష్టిపెట్టారు. పార్టీ హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం క్యాండిడేట్ల సెలక్షన్ ప్రాసెస్ జరుగుతోంది. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక ఉండాలని భావిస్తోంది.
కాంగ్రెస్ లో ప్రతీ ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ స్థానానికి ముగ్గురు చొప్పున అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. స్థానిక మండల నాయకులు చర్చించుకొని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేకు ప్రతిపాదిస్తే, వారిలో లోకల్ సర్వే ఆధారంగా ముగ్గురిని ఎంపిక చేసి జిల్లా ఇన్చార్జి మంత్రికి అందించనున్నారు. అక్కడి అప్రూవల్ తర్వాత పీసీసీ స్థాయిలో చర్చించి పోటీ చేసే జడ్పీటీసీ అభ్యర్థులను ప్రకటించనున్నారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లు పార్టీ గుర్తులతో జరుగుతుండగా, సర్పంచ్ ఎన్నికలు మాత్రం పార్టీ సింబల్ లేకుండానే జరుగుతాయి. ఇండిపెండెంట్ గుర్తులతోనే అయినా, పార్టీ బలపరిచిన అభ్యర్థి కీలకం కావడంతో అందుకు తగిన విధంగా కసరత్తు చేస్తున్నారు.
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్యే పోటీ ఉండనుంది. కొన్ని మండలాల్లో సీపీఎం, మరికొన్నింటిలో సీపీఐ, ఇంకొన్ని మండలాల్లో సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ, ప్రజాపంథా లాంటి పార్టీల ప్రభావం ఉండనుంది. ఇక ఉమ్మడి జిల్లాలో బీజేపీ ప్రభావం నామమాత్రం కాగా, ఏపీ సరిహద్దుల్లో ఉండడంతో తెలుగుదేశం పార్టీ కూడా కొంత కీలకంగా మారనుంది.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో సీపీఐ పొత్తు ఉండడంతో ఈ సారి కూడా ఆ రెండు పార్టీలు కలిసే పోటీ చేసే ఛాన్సుంది. మిగిలిన పార్టీల పొత్తులపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. మరోవైపు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ బలహీనపడింది. లోక్ సభ ఎన్నికల్లో ఏకపక్షంగా కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లు పోలవడంతో ఆ పార్టీ ముఖ్య నేతలు కాస్త డీలాపడ్డారు.
అయితే ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చిందని, ఈ 21 నెలల పాలనలో ప్రభుత్వ వ్యతిరేకత, యూరియా ఇబ్బందులు, హామీల అమల్లో వైఫల్యం లాంటి అంశాలు తమకు కలిసి వస్తాయని బీఆర్ఎస్ లీడర్లు చెబుతున్నారు. పార్టీ పరంగా మండల స్థాయిలో ముఖ్య నేతలతో చర్చించిన తర్వాత అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఇప్పటికే ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల సన్నాహక సమావేశాన్ని పూర్తి చేశారు.
బీజేపీ కూడా తమ ఉనికిని కాపాడుకునేందుకు ప్లాన్ చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే, మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఓట్ శాతం పెరిగిందని, ఈసారి కొన్ని స్థానాలు కూడా గెల్చుకుంటామని చెబుతోంది. మరో వైపు కమ్యూనిస్టు పార్టీలు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా కామ్రేడ్లకు అడ్డా అని, ప్రత్యర్థి పార్టీలకు షాక్ ఇస్తామని అంటున్నాయి.
ఏ జిల్లాలో.. ఎన్ని స్థానాలు..?
ఖమ్మం జిల్లాలో 20 జడ్పీటీసీ, 283 ఎంపీటీసీలు, 571 సర్పంచ్ స్థానాలున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 22 జడ్పీటీసీ, 233 ఎంపీటీసీ, 471 సర్పంచ్ స్థానాలున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ప్రకారం ఈనెల 9న స్థానిక ఎలక్షన్లకు నోటిఫికేషన్ రానుంది. ఆరోజు నుంచే నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభం కానుంది. అప్పటి వరకు పార్టీ పరంగా క్యాండిడేట్ల సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి.