హిమాచల్​ప్రదేశ్​లో రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు

హిమాచల్​ప్రదేశ్​లో రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు

న్యూఢిల్లీ: హిమాచల్​ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో మంగళవారం క్రాస్ ఓటింగ్​కు పాల్పడిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా అనర్హత వేటు వేశారు. వారిని అసెంబ్లీ నుంచి డిస్ క్వాలిఫై చేసినట్టు స్పీకర్ గురువారం ప్రకటించారు. కాంగ్రెస్ తరఫున గెలిచి పార్టీ ఫిరాయింపులకు పాల్పడినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ధర్మశాల ఎమ్మెల్యే సుధీర్ శర్మ, సుజన్‌‌‌‌పూర్ ఎమ్మెల్యే రాజేంద్ర రాణా, కుత్లహర్ ఎమ్మెల్యే దేవేంద్ర భుట్టో, గాగ్రెట్ ఎమ్మెల్యే చైతన్య శర్మ, లాహౌల్ స్పితి ఎమ్మెల్యే రవి ఠాకూర్, బాద్సర్ ఎమ్మెల్యే ఇంద్ర దత్ లఖన్‌‌‌‌పాల్ సభ్యత్వాలను రద్దు చేసినట్టు తెలిపారు. ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ విప్​ను ధిక్కరించారని తెలిపారు.

అదేవిధంగా, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కూడా ఉల్లంఘించారని వివరించారు. రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటేసినందున.. కాంగ్రెస్ సర్కారు మైనార్టీలో పడిందని, బలపరీక్షను ఎదుర్కోవాలంటూ ప్రతిపక్ష బీజేపీ బుధవారం డిమాండ్ చేసింది. అయితే, సభ నుంచి 15 మంది బీజేపీ ఎమ్మేల్యేలను సస్పెండ్ చేసిన వెంటనే బడ్జెట్ ను ప్రభుత్వం పాస్ చేసుకుంది. గురువారం రెబెల్ ఎమ్మెల్యేలను డిస్ క్వాలిఫై చేయడంతో సర్కారు మైనార్టీ గండాన్ని దాటింది. గురువారం సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖూ, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తోపాటు పలువురు పార్టీ అబ్జర్వర్లు గురువారం పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. పార్టీలో సంక్షోభం ముగిసిపోయిందని ప్రకటించారు.