చత్తీస్​గఢ్​లో కాంగ్రెస్ మేనిఫెస్టో.. రుణమాఫీ, ఇండ్లకు ఫ్రీ కరెంటు

చత్తీస్​గఢ్​లో కాంగ్రెస్ మేనిఫెస్టో..   రుణమాఫీ, ఇండ్లకు ఫ్రీ కరెంటు

రాజ్​నంద్ గావ్: వ్యవసాయ రుణాల మాఫీ, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు, కులగణన, కేజీ టు పీజీ ఉచిత విద్య హామీలతో చత్తీస్‌‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. రూ.500 లకే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని పేర్కొంది. ఆదివారం రాజ్‌‌నంద్‌‌గావ్‌‌లో చత్తీస్‌‌గఢ్ సీఎం భూపేశ్ బాఘెల్ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మైనారిటీల్లో కులాల వారీగా జనాభా లెక్కల కోసం సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. కులాల వారీగా జనాభాను లెక్కించి బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక ప్రయోజనాలను అందించడంతో పాటు అధికారంలోకి రాగానే వారి కోసం ‘ప్రత్యేక విధానాలు’ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందిస్తుందని బఘేల్ తెలిపారు.

సంక్షేమం.. రైతు క్షేమం

వరి ధాన్యాన్ని క్వింటాల్‌‌కు రూ.3,200కు కొనుగోలు చేస్తామని, గ్యాస్‌‌ సిలిండర్‌‌లను రూ.500కే ఇస్తామని, 17.5 లక్షల మందికి సీఎం ఆవాజ్‌‌ యోజన కింద ఉచిత ఇండ్లు, కేజీ నుంచి పీజీ వరకు విద్య ఉచితంగా అందిస్తామని కాంగ్రెస్‌‌ మేనిఫెస్టోలో పేర్కొంది. ఖూబ్‌‌చంద్ బఘేల్ స్వస్థ్యా సహాయత యోజన కింద రూ.10 లక్షల వైద్య బీమా కూడా అందిస్తామని ప్రకటించింది. వ్యాపారాలు చేసుకునే వారికి ప్రస్తుతం ఉన్న 40 శాతంతో పోలిస్తే 50 శాతం వరకు లోన్లు మాఫీ చేయనున్నట్లు తెలిపింది. ఇలా మేనిఫెస్టోలో 20 హామీలు ప్రకటించారు. చత్తీస్‌‌గఢ్‌‌లో ఈ నెల 7, 17 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 7న తొలి దశలో 20 అసెంబ్లీ స్థానాలకు, 17న రెండో దశలో మిగిలిన 70 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు.