కాంగ్రెస్​తోనే ప్రజా ప్రభుత్వం ..  కేసీఆర్​ది కుటుంబ, అవినీతి పాలన: జైరామ్ రమేశ్

కాంగ్రెస్​తోనే ప్రజా ప్రభుత్వం ..  కేసీఆర్​ది కుటుంబ, అవినీతి పాలన: జైరామ్ రమేశ్

తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబ పాలన కావాలా? కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కావాలా? తేల్చుకోవాలని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేశ్ అన్నారు. శుక్రవారం మునుగోడు మండల కేంద్రంలో పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అప్పటి కాంగ్రెస్ ఎంపీలే కీలక పాత్ర పోషించారని చెప్పారు. కాంగ్రెస్ ఎంపీల రిక్వెస్ట్ తోనే సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు.

అయితే, ప్రత్యేక రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగడంలేదన్నారు. పదేండ్లుగా నలుగురు వ్యక్తుల చేతిలో రాష్ట్రం బందీ అయిందన్నారు. సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లో పడుకొని నిజాం రాజులా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.  కాంగ్రెస్ హయాంలో కట్టిన పెద్ద పెద్ద ప్రాజెక్టులు చెక్కుచెదరకుండా ఉంటే.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కట్టిన కాళేశ్వరం కుంగిపోతోందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒక్కటేనని.. రాష్ట్రంలో కాంగ్రెస్ నే గెలిపించాలన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డితోపాటు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.   

కారు ఇక మ్యూజియంలోకే.. 

బీఆర్ఎస్ కారును మ్యూజియంలో పెట్టే రోజులు దగ్గర పడ్డాయని జైరామ్ రమేశ్​ఎద్దేవా చేశారు. శుక్రవారం ఖమ్మం టౌన్ లోని కాంగ్రెస్ జిల్లా ఆఫీసులో పార్టీ ఖమ్మం అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యే సమయంలో అసలు టీఆర్ఎస్ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ కృషి వల్లే రాజ్యసభలో బిల్లు పాస్ అయిందన్నారు. కేసీఆర్ సర్కార్ టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్ వేసి, పేపర్ లీక్ చేసి నిరుద్యోగుల ఆశలను నీరుగార్చిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ స్కీంలను ప్రజలందరికీ చేరువ చేస్తామని చెప్పారు.