విష్ణు లంచ్ మీటింగ్కు పలువురు సీనియర్లు

విష్ణు లంచ్ మీటింగ్కు పలువురు సీనియర్లు

పీజేఆర్ కుమారుడు, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి నివాసంలో జరిగిన లంచ్ మీటింగ్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు తెరపైకి వచ్చిన సమయంలో పార్టీ సీనియర్లు విష్ణు ఇంటికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేకుండానే సమావేశం ఏర్పాటు చేయడం రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీసింది.

హైకమాండ్ ఆదేశాలను కాదని..!
విష్ణువర్థన్ రెడ్డి లంచ్ మీటింగ్ నేపథ్యంలో ఆయన ఇంటికి నేతలెవరూ వెళ్లొద్దని హైకమాండ్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఉదయం వరకు వెళ్దామనుకున్న నాయకులు వెనక్కి తగ్గినట్లు కనిపించింది. అయితే లంచ్ సమయానికి పలువురు సీనియర్లు విష్ణు నివాసంలో ప్రత్యక్షమయ్యారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్తో పాటు  మధుయాష్కీ గౌడ్, శ్రీధర్ బాబు, దాసోజు శ్రవణ్, వీహెచ్, మన్ మోహన్ రావు, బెల్లయ్య నాయక్, రోహన్ రెడ్డి, చామల కిరణ్ తదితరులు విందుకు హాజరయ్యారు. హైకమాండ్ వద్దని చెప్పినా వీరంతా విష్ణు ఇంటికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఎలాంటి వ్యూహం లేదన్న విష్ణు
ఇదిలా ఉంటే లంచ్ మీటింగ్ ఏర్పాటులో ఎలాంటి వ్యూహం లేదని విష్ణువర్థన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిసారి లాగే ఇప్పుడు కూడా విందు ఏర్పాటు చేశానని అన్నారు. అందుబాటులో ఉన్న కాంగ్రెస్ సీనియర్లందరినీ ఆహ్వానించానని చెప్పారు. అప్పుడప్పుడూ అందరినీ కలుస్తూ ఉంటానని, ఈ మధ్య చాలా గ్యాప్‌ వచ్చినందుకే తాజాగా సీనియర్ లీడర్లను భోజనానికి పిలిచానని విష్ణు అంటున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలు ఢిల్లీలో ఉన్నందున వారిని ఆహ్వానించలేదని చెప్పారు. పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకుంటున్నానని, కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.

సోదరి చేరికపై అసంతృప్తి?
పీజేఆర్ కుమార్తె, విష్ణువర్థన్ రెడ్డి సోదరి ఈ మధ్యనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆమె పార్టీలో చేరడంపై విష్ణు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై స్పందించేందుకు నిరాకరించిన ఆయన.. పీజేఆర్ వారసత్వాన్ని తానుగానీ తన సోదరిగానీ భుజాన వేసుకోవడం లేదని కార్యకర్తలే పీజేఆర్ వారసత్వం కాపాడతారని చెప్పడం విశేషం.