విపక్షాలపై రాజ్ నాథ్ ఫైర్: పాకిస్తాన్ వెళ్లి శవాలు లెక్కేసుకోండి

విపక్షాలపై రాజ్ నాథ్ ఫైర్: పాకిస్తాన్ వెళ్లి శవాలు లెక్కేసుకోండి

వాయువ్య పాకిస్థాన్ లోని బాలాకోట్​లో గల టెర్రరిస్టు క్యాంపుపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడుల్లో ఎంత మంది ముష్కరులు హతమయ్యారో ఒకట్రెండు రోజుల్లో వెల్లడిస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. ‘ఆపరేషన్ బాలాకోట్’పై ప్రతిపక్ష పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న దరిమిలా మృతుల సంఖ్యపై ఖచ్చితంగా క్లారిటీ ఇస్తామన్న ఆయన, డౌటుంటే ప్రతిపక్ష నేతలంతా పాకిస్తాన్ కు వెళ్లి శవాలు లెక్కేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. మంగళవారం అస్సాంలో పర్యటించిన హోం మంత్రి, ఇండో–బంగ్లా సరిహద్దులో ‘స్మార్ట్​ ఫెన్సిం గ్’ వ్యవస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా దుబ్రిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.

‘‘ఐఏఎఫ్ అటాక్స్​ జరిగినప్పుడు బాలాకోట్​ టెర్రర్ క్యాంప్ లో 300 మొబైల్ ఫోన్లు యాక్టీవ్​గా ఉన్నాయని మన నేషనల్ టెక్నికల్ రీసెర్చ్​ ఆర్గనైజేషన్ ఇన్ఫామ్​ చేసింది. సెల్ ఫోన్లను చెట్లూ చేమలు వాడవు కదా! ఖచ్చితంగా అక్కడుంది టెర్రరిస్టులే. ఐతే ఎంత మంది చనిపోయారో చెప్పాలంటూ ప్రతిపక్షాలు గోల చేస్తున్నాయి. అంటే వాళ్ల ఉద్దేశం, దాడుల తర్వాత ఐఏఎఫ్ వెనక్కి తిరిగెళ్లి, వన్ , టూ, త్రీ, ఫోర్ .. అని డెడ్​బాడీలను లెక్కేయాలనా? రేపో ఎల్లుండో మృతుల సంఖ్య వెల్లడిస్తాం.’’అని రాజ్ నాథ్ అన్నారు.