
కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను హిందూ వ్యతిరేకిని కాదని, హిందుత్వ వ్యతిరేకిని అని అన్నారు. హిందుత్వం హింసను, హత్యలను, విభజనను ప్రోత్సహిస్తుందని.. అది రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. కలబుర్గిలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ బయోపిక్ పుస్తకావిష్కరణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హిందుత్వం.. హిందూ మతం కంటే భిన్నమైనదని, తాను స్వయంగా హిందువునేనని, కానీ మనువాదం, హిందుత్వంకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. హింసను ఏ మతం సమర్థించదు కానీ హిందుత్వం, మనువాదం మాత్రం హత్యలు, హింస, వివక్షకు మద్దతిస్తాయన్నారు.
అయితే హిందుత్వంపై సిద్ధరామయ్య ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు జనవరి 8న ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తాను హిందువునని, అయితే హిందుత్వానికి వ్యతిరేకమని ప్రకటించారు. ఇదే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అయోధ్యలో రామమందిరాన్ని తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని, రాజకీయ ప్రయోజనాల కోసం దానిని ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.