జుట్టు కత్తిరించడమూ తెలుసు.. టీఆర్ఎస్ తోకలు కత్తిరించడమూ తెలుసు

జుట్టు కత్తిరించడమూ తెలుసు.. టీఆర్ఎస్ తోకలు కత్తిరించడమూ తెలుసు
  • నాయీ బ్రాహ్మణులు టీఆర్ఎస్ తోకలు కత్తిరిస్తరు
  • మోసం చేసిన కేసీఆర్ సర్కార్‌‌‌‌కు గుండు కొడ్తరు 
  • గాంధీభవన్ వద్ద నాయీ బ్రాహ్మణుల నిరసనలో దాసోజు   

హైదరాబాద్, వెలుగు: ‘‘నాయీ బ్రాహ్మణులకు జుట్టు కత్తిరించడమే కాదు అవసరమైతే టీఆర్ఎస్ తోకలు కత్తిరించడమూ తెలుసు. గడ్డం గీయడమే కాదు.. మోసం చేసిన కేసీఆర్ సర్కార్ కు గుండుకొట్టి, గద్దె దించడమూ తెలుసు..” అని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నాయీ బ్రాహ్మణుల జీవితాలతో సీఎం కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. నాయీ బ్రాహ్మణులకు కేసీఆర్ చేసిన మోసానికి వ్యతిరేకంగా శనివారం గాంధీ భవన్ లో వినూత్నంగా నిరసన చేపట్టారు. గాంధీ విగ్రహం వద్ద క్షవరం చేసి, గడ్డం గీసి దాసోజు శ్రవణ్ నిరసన తెలిపారు. నాయీ బ్రాహ్మణులకు 30 వేల మోడ్రన్ సెలూన్లు, 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఒక ఎమ్మెల్సీ పదవి, ఫెడరేషన్, బడ్జెట్ లో రూ. 250 కోట్లు కేటాయిస్తామన్న కేసీఆర్.. తన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో 52 శాతం ఉన్న బీసీలు ఉద్యమంలో భాగమయ్యారని, నేడు త్యాగాలు ఒకరివి, భోగాలు మరొకరికి అన్నట్లుగా ఉందన్నారు. బీసీల కోసం రూ. 25 వేల కోట్లు ఇస్తామని కేసీఆర్ చెప్పారని, కానీ రూ. 10 కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. గత రెండేండ్లలో రూ. 5 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. కార్యక్రమంలో పీసీసీ నేతలు మెట్టు సాయి కుమార్, శ్రీకాంత్ గౌడ్, నాయీ బ్రహ్మణ నేత కొలిపాక సతీష్ పాల్గొన్నారు.