
- మధుయాష్కీ సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు రాలే
- సమావేశంలో మహేశ్వర్ రెడ్డిపై మాణిక్కం ఫైర్
- బయటకొచ్చి పార్టీలో ఉండలేనన్న మహేశ్వర్ రెడ్డి
- బుజ్జగించడంతో కొనసాగుతానని ప్రకటన
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ లో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. బుధవారం గాంధీభవన్ లో మునుగోడు ఉప ఎన్నికపై కోఆర్డినేటర్లతో కాంగ్రెస్ స్టేట్ ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్ మీటింగ్ నిర్వహించారు. దీనికి సీనియర్లు డుమ్మా కొట్టారు. మునుగోడు ఉప ఎన్నిక క్యాంపెయిన్ కమిటీ కన్వీనర్ మధుయాష్కీ, మెంబర్ ఎమ్మెల్యే సీతక్క సహా ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, పొదెం వీరయ్య, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి హాజరుకాలేదు. మరోవైపు కరోనా కారణంగా పీసీసీ చీఫ్ ఎంపీ రేవంత్ రెడ్డి మీటింగ్ కు దూరంగా ఉన్నారు. ఇక కొంతమంది నేతలు మీటింగ్ మొదలైనంక వచ్చినట్లు తెలిసింది. సీఎల్పీ బృందం భూపాలపల్లి పర్యటనలో ఉండగా, మిగతా నేతలు కూడా మీటింగ్ కు రాకపోవడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాణిక్కం మీటింగ్ ను, మునుగోడు బైపోల్ ను నేతలు లైట్ తీసుకుంటున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. కాగా, బైపోల్ క్యాంపెయిన్ కమిటీ కన్వీనర్ అయిన మధుయాష్కీ రాకపోవడంపై ఠాగూర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. మండలాల ఇన్ చార్జులు సరిగా పని చేయడం లేదని.. పార్టీ నుంచి నేతలు వెళ్లిపోతున్నా అడ్డుకోవడం లేదని అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. సెప్టెంబర్ 7న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభమవుతుందని, అక్టోబర్ చివరలో రాష్ట్రంలో ఆయన పాదయాత్ర ఉంటుందని ఠాగూర్ నేతలకు చెప్పారు. మునుగోడులో గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. మీటింగ్ లో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేశ్ కుమార్, అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, నదీమ్ జావిద్, రోహిత్ చౌదరి, సంపత్ కుమార్, నేతలు షబ్బీర్ అలీ, మల్లు రవి, గీతారెడ్డి, వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
విభేదాలపై అంతర్గతంగా చర్చించుకుంటం: మహేశ్వర్ రెడ్డి
మీటింగ్ లో ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై ఠాగూర్ ఫైర్ అయినట్లు తెలిసింది. కార్యక్రమాల అమలుపై నివేదికలు రావడం లేదని ఆయన అన్నట్లు సమాచారం. దీంతో అన్ని బాగానే జరుగుతున్నా, జరగడం లేదని ఎట్ల అంటారని మహేశ్వర్ రెడ్డిని ప్రశ్నించినట్లు తెలిసింది. వెంటనే సమావేశం నుంచి బయటకు వచ్చిన ఆయన.. తాను ఇక పార్టీలో ఉండలేనని మీడియాతో చెప్పారు. అయితే ఆ తర్వాత ఏఐసీసీ కార్యదర్శులు ఆయనను బుజ్జగించారు. మళ్లీ సాయంత్రం మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. “పార్టీలో విభేదాలుంటే అంతర్గతంగా చర్చించకుంటం. ఠాగూర్, రేవంత్ పై అసంతృప్తి లాంటివి అంతర్గత విషయాలు. పార్టీకి రాజీనామా చేస్తున్నానని వచ్చిన వార్తలను ఖండిస్తున్నాను” అని అన్నారు.
22 నుంచి ప్రచారం: మాణిక్కం
మీటింగ్ ముగిసినంక మాణిక్కం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 22 నుంచి మునుగోడులో ప్రచారం ప్రారంభిస్తామని, 100 రోజుల మిషన్ లో భాగంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తామని చెప్పారు. అదే రోజు నుంచి మండలాల వారీగా పార్టీ నేతలతో రేవంత్ సమావేశాలు నిర్వహిస్తారని తెలిపారు. గుజరాత్ ఎన్నికలతో పాటు బైపోల్ జరుగుతుందని పేర్కొన్నారు. భూపాలపల్లిలో సీఎల్పీ బృందాన్ని అరెస్ట్ చేయడంపై ఫైర్ అయ్యారు. మీటింగ్ కు సీనియర్లు రాకపోవడంపై మీడియా ప్రశ్నించగా.. దీనికి సీనియర్లను ఆహ్వానించలేదని, అవసరమైనప్పుడు వారి సేవలు వినియోగించుకుంటామని జవాబు ఇచ్చారు. మహేశ్వర్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి కామెంట్లపై మాత్రం స్పందించలేదు. “బీజేపీకి వెళ్లే వాళ్ల విమర్శలపై నేను స్పందించను. రేవంత్ చేసిన హోంగార్డు కామెంట్లు ముగిసిన చాప్టర్ ” అని అన్నారు. రాష్ర్ట వ్యవహారాల ఇన్ చార్జ్ గా ప్రియాంక గాంధీ వస్తే మంచిదని, ఆమెకు ఇక్కడి విషయాలన్నీ తెలుసని చెప్పారు. రాష్ట్రం నుంచి పోటీపై రాహుల్, ప్రియాంకను కోరితే వాళ్లు ఆలోచిస్తారన్నారు.
డీసీసీ అధ్యక్షులతో మీటింగ్..
మునుగోడు ఉప ఎన్నికలో కలసికట్టుగా పని చేయాలని నేతలకు మాణిక్కం ఠాగూర్ సూచించారు. బుధవారం గాంధీభవన్ లో డీసీసీ అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు. ఈ నెల 7 నుంచి 15 వరకు జిల్లాల్లో జరిగిన 75 కిలోమీటర్ల “ఆజాదీ కా గౌరవ్ పాదయాత్ర’’ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని జిల్లాల్లో పాదయాత్ర బాగా జరిగిందని ప్రశంసించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులను సన్మానించారు. టీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు మధ్య జరుగుతున్న యుద్ధంలో చావో రేవో తేల్చుకోవాలని మాణిక్కం పిలుపునిచ్చారు. మునుగోడు కాంగ్రెస్ కు కీలకమన్నారు.