
సంగారెడ్డి, వెలుగు: దేశ ద్రోహులకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. జిన్నారంలో మత ఘర్షణలో అరెస్టైన బీజేపీ కార్యకర్తలను సోమవారం సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలులో ఆయన పరామర్శించారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం నుంచి దేశద్రోహులను వెంటనే పంపించాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు.
జిన్నారం కోదండ రామాలయం భూముల్లో అక్రమంగా మదర్సా నిర్మించారని, అక్కడ బంగ్లాదేశీయులు ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. జిన్నారం వ్యవహారంపై జిల్లా అధికారులు ఎందుకు స్పందించడం లేదని, సరైన సమాధానం ఇవ్వకపోతే డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామని ఎంపీ హెచ్చరించారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర నేతలు కొండాపురం జగన్, పవన్, జిన్నారం నేతలు ఉన్నారు.