సమర్థులకే డీసీసీ పగ్గాలు.. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌‌కు ఏఐసీసీ చీఫ్ ఖర్గే ఆదేశం

సమర్థులకే డీసీసీ పగ్గాలు.. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌‌కు ఏఐసీసీ చీఫ్ ఖర్గే ఆదేశం
  • పార్టీని పటిష్టం చేయడంపై ఫోకస్ పెట్టాలని దిశానిర్దేశం 
  • అక్టోబ‌‌ర్ నెలాఖరుకల్లా డీసీసీ అధ్యక్షుల నియామ‌‌కం: పీసీసీ చీఫ్ 
  • జూబ్లీహిల్స్ టికెట్ ఆశిస్తున్న బొంతు రామ్మోహన్ కూడా ఖర్గేతో భేటీ! 

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా సమర్థవంతమైన నేతలకు పార్టీ జిల్లా అధ్యక్ష (డీసీసీ) బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. శుక్రవారం ఢిల్లీలో ఖర్గే నివాసంలో ఆయనతో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ భేటీ అయ్యారు. దాదాపు అరగంటకు పైగా సాగిన సమావేశంలో తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, తీసుకుంటున్న ప్రజాహిత నిర్ణయాలను ఖర్గేకు వివరించారు. 

ఈ సందర్బంగా పలు అంశాలపై పార్టీ చీఫ్ దిశానిర్దేశం చేశారు. జిల్లాల్లో సమర్థవంతమైన నాయకత్వాన్ని రూపొందించాలని ఆదేశించారు. నాయకులకే క్షేత్ర స్థాయిలో ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొనే బాధ్యతలు అప్పగించాలని చెప్పారు. సమావేశం అనంతరం మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. పకడ్బందీగా, ఏ గ్రూపు ఒత్తిడికీ తలొగ్గకుండా పార్టీ సంస్థాగత పునర్నిర్మాణం చేపట్టాలని ఖర్గే సూచించారని తెలిపారు. అక్టోబర్ 4 నుంచి ఏఐసీసీ పరిశీలకులు అన్ని జిల్లాల్లో పర్యటిస్తారన్నారని, 15వ తేదీ కల్లా ప్రతి జిల్లాకు, డీసీసీ అధ్యక్ష పదవికి ఎంపిక చేసిన ఆరుగురు పేర్లను సమర్పిస్తారని వెల్లడించారు. 

అక్టోబర్ నెలాఖరు కల్లా డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తవుతుందన్నారు. కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో టికెట్ ఆశిస్తున్న జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా పార్టీ చీఫ్ ఖర్గేతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు.  

మూసీ ప్రాజెక్టుకు కిషన్ రెడ్డే అడ్డు..

 గుజరాత్ లో సబర్మతి రివర్ ను అభివృద్ధి చేస్తున్నప్పుడు, తెలంగాణలో మూసీ ప్రక్షాళనకు ఎందుకు అంగీకరించరని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మహేశ్ గౌడ్ ప్రశ్నించారు. మూమ్మాటికీ మూసీ అభివృద్ధిని కిషన్ రెడ్డే అడ్డుకుంటున్నారని విమర్శించారు. ‘తెలంగాణ అభివృద్ధిపై కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే.. అది సాకారమయ్యేది. అభివృద్ధి విషయంలో రాజకీయాలు సరికాదు. ఆయనపై నాకు వ్యక్తిగత కోపమేమీ లేదు. ఆయన మంచి మిత్రుడే, కానీ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నందుకే ప్రశ్నిస్తున్నా’ అని చెప్పారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఒక మెట్టు దిగి వస్తే బీసీ బిల్లులు వెంటనే ఆమోదం పొందుతాయన్నారు. ఫార్ములా–ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ అడ్డంగా దొరికిపోయారని, ఆయన అరెస్టు కావడం పక్కా అని మరోసారి కామెంట్ చేశారు. 

ధైర్య, సాహసాలకు ఐలమ్మ మారుపేరు.. 

చాకలి ఐలమ్మ ధైర్య సాహసాలకు మారుపేరని మహేశ్ గౌడ్ కొనియాడారు. నేటి యువత ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐలమ్మ జయంతి కార్యక్రమంలో మహేశ్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు.