రేపు (సెప్టెంబర్ 29) ఢిల్లీలో కాంగ్రెస్ ఆత్మగౌరవ సదస్సు

రేపు (సెప్టెంబర్ 29)  ఢిల్లీలో కాంగ్రెస్ ఆత్మగౌరవ సదస్సు
  • దేశ వ్యాప్తంగా దళితులు, ఆదివాసీలపై జరుగుతున్న ఘటనలపై చర్చ

న్యూఢిల్లీ, వెలుగు: ఉత్తరాఖండ్‌‌‌‌ హల్ద్వానీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ర్యాలీ తర్వాత జరిగిన 'శుద్ధీకరణ' వివాదానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కీలక సమరానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా ఢిల్లీలోని కాన్‌‌‌‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో మంగళవారం ‘దళిత, ఆదివాసీ ఆత్మగౌరవ సదస్సు’ను నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం నేత, ఎంపీ మల్లు రవి వెల్లడించారు.

ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఎంపీలు మనోజ్ కుమార్, తనుజ్ పునియా, కరమ్‌‌‌‌వీర్ బౌధ్, భజన్ లాల్ జాతవ్‌‌‌‌, ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ విక్రాంత్ భూరియాతో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు. కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం, సంబంధిత ఏఐసీసీ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగనుంది.

దేశవ్యాప్తంగా దళితులు, ఆదివాసీలపై పెరుగుతున్న వివక్ష, హింసాత్మక ఘటనలను ఈ సదస్సులో చర్చిస్తామని మల్లు రవి స్పష్టం చేశారు. హల్ద్వానీలో ఖర్గే ర్యాలీ అనంతరం చేపట్టిన శుద్ధీకరణ కార్యక్రమం ఆయన వ్యక్తిగత గౌరవానికి, హుందాతనానికి జరిగిన తీవ్ర అవమానమని మండిపడ్డారు. పౌర హక్కుల పరిరక్షణ చట్టం-1955, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నివారణ చట్టం-1989 ఉల్లంఘనలపై సమావేశంలో ఆందోళన వ్యక్తం చేయనున్నారు. ఈ సదస్సుకు ఉభయసభల కాంగ్రెస్ ఎంపీలు, మాజీలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు పార్టీ విభాగాల ప్రతినిధులు హాజరుకానున్నారు.