నేడు (సెప్టెంబర్ 25) ఎన్నికల కమిషన్ల ముందు కాంగ్రెస్ నిరసన

నేడు (సెప్టెంబర్ 25)  ఎన్నికల కమిషన్ల ముందు కాంగ్రెస్ నిరసన
  • ఓట్ చోరీ, సీఈసీ తీరును నిరసిస్తూ ఆందోళనలు
  • అన్ని రాష్ట్రాల పీసీసీలకు కేసీ వేణుగోపాల్ పిలుపు

న్యూఢిల్లీ, వెలుగు: ఓట్ చోరీ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తీరుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా తొలి దశ ఆందోళనలకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఇందులో భాగంగా శుక్రవారం అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషన్ల వరకు భారీ ర్యాలీ చేపట్టి నిరసన తెలపాలని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ(సంస్థాగత) కేసీ వేణుగోపాల్ పీసీసీలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ లతో ఆయన సమావేశం నిర్వహించారు.

తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ చేపట్టబోయే ఆందోళనలపై కేసీ వారికి వివరించారు. ‘శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయాల వద్ద భారీ నిరసన ర్యాలీలు నిర్వహించాలి. 28న అన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీలు కలెక్టరేట్ల వద్ద  భారీ నిరసన ర్యాలీలను నిర్వహించాలి’ అని వెల్లడించారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు కాంగ్రెస్ అవిశ్రాంతంగా ఆందోళనలు కొనసాగిస్తుందని తెలిపారు. అలాగే, ఈ నెల 29న ఈ అంశంపై ఏఐసీసీ భేటీ కానున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. తదుపరి వ్యూహాలు, దేశ వ్యాప్తం ఆందోళనలపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.