- గిరిజనుల రిజర్వేషన్లకు 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: ప్రధానిగా ఇందిరా గాంధీ దేశంలో గిరిజనులకు రిజర్వేషన్లను అమలుచేసి 50 ఏండ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా..దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసేందుకు50 రోజుల పాటు బస్సు యాత్ర చేయాలని కాంగ్రెస్ ఆదివాసీ ప్రజా ప్రతినిధులు నిర్ణయించారు. మంగళవారం గాంధీ భవన్‌లో పీసీసీ ఆదివాసీ సెల్ చైర్మన్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అధ్యక్షతన ఎస్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమావేశం జరిగింది.
ఇందులో ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు రాంచంద్రు నాయక్, రాందాస్ నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ఇతర నేతలు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ 50 రోజుల బస్సు యాత్రను రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించి, గిరిజనుల సంక్షేమానికి కాంగ్రెస్ చేస్తున్న కృషిని వివరించనున్నట్టు సమావేశం నిర్ణయించింది. తెలంగాణలోని అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ముగింపు సభను హైదరాబాద్‌లో నిర్వహించాలని మీటింగ్ తీర్మానించింది.
