- ఈ నెల 8 నుంచి ఫిబ్రవరి 25 వరకు దేశవ్యాప్తంగా ఆందోళనలు
- కాంగ్రెస్ లీడర్లు కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్ వెల్లడి
- కొత్త చట్టంతో పేదల పొట్ట కొట్టేందుకు కుట్రపన్నారని కేంద్రంపై ఫైర్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ‘వీజీ జీ రామ్ జీ’ చట్టంపై కాంగ్రెస్ యుద్ధభేరి మోగించింది. జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని కోరుతూ ఈ నెల 8 నుంచి ఫిబ్రవరి 25 వరకు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్ వెల్లడించారు.
శనివారం ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వేణుగోపాల్ మాట్లాడుతూ జీ రామ్ జీ చట్టంతో పేదల కడుపు కొట్టేందుకు, పంచాయతీల అధికారాన్ని లాక్కునేందుకు కేంద్రం కుట్రపన్నిందన్నారు. ఆ పథకాన్ని కేంద్రం పూర్తిగా తన వద్దే ఉంచుకోవాలని చూస్తోందని ఆయన విమర్శించారు. కేంద్రం నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేస్తామని తెలిపారు.
‘‘కేంద్రం ఏకపక్షంగా ఉపాధి హామీ పథకం పేరును మార్చింది. ఇది ఫెడరల్ వ్యవస్థపై దాడే. పథకం పేరును మార్చే ముందు రాష్ట్రాలతో కేంద్రం అసలు సంప్రదింపులు జరపనే లేదు. నరేగా బచావో సంగ్రామ్ ను దేశంలోని ప్రతి పల్లెకూ తీసుకెళ్తాం. ఉపాధి హక్కు, పంచాయతీ రాజ్ వ్యవస్థలు, మహిళలు, కార్మికులు, ఆదివాసీల హక్కులను కాపాడడమే మా ఉద్దేశం” అని వేణుగోపాల్ పేర్కొన్నారు. కాగా, జీ రామ్ జీ చట్టంలో ఉపాధి హామీపై గ్యారంటీనే లేదని, ఆ చట్టం చాలా ప్రమాదకరమైనదని జైరాం రమేశ్ విమర్శించారు.
