- హరీశ్ రావుపై ఆరోపణలకు ఆయనే సమాధానం చెప్పాలి: కవిత
- ఖమ్మం జిల్లాలో ‘జనం బాట’ పర్యటన
మధిర, ఎర్రుపాలెం, తల్లాడ, సత్తుపల్లి, వైరా, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ముమ్మాటికీ ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ వైఫల్యమేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ప్రధాన ప్రతిపక్షాలు ప్రజల సమస్యలపై పోరాటం చేయడంలేదని అందుకే ఆ బాధ్యతను జాగృతి తీసుకుందని తెలిపారు.
సోమవారం ఖమ్మం జిల్లాలోని మధిర, సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో ఆమె ‘జాగృతి జనం బాట’ పర్యటన చేపట్టారు. ఉదయం ఎర్రుపాలెం మండలం జమలాపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ హరీశ్ రావు మీద వచ్చిన ఆరోపణలకు ఆయనే సమాధానం చెప్పాలి కానీ పిల్లి మీద పిట్ట మీద పెట్టి వందిమాగదులతో మాట్లాడిస్తుంటే ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.
రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న వారికి ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. స్థానికంగా నిర్మాణం జరుగుతున్న అర్బన్ పార్క్ ఏకో టూరిజం ప్రాజెక్ట్ భూనిర్వాసితులను ఆమె పరామర్శించారు. భూములు కోల్పోయిన రైతులకు జాగృతి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
తర్వాత మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి గ్రామంలో లెదర్ పార్క్ స్థలాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఇచ్చిన వినతి పత్రం స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
సింగరేణి సీఎండీ ఆఫీసు ముట్టడిస్తం
అపరిష్కృతంగా ఉన్న సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 19న సింగరేణి సీఎండీ కార్యాలయం ముట్టడించనున్నట్టు కవిత ప్రకటించారు. సత్తుపల్లి లోని సింగరేణి ఏరియాలో పర్యటించిన ఆమె జేవీఆర్ ఓసీ గేట్ మీటింగ్ లో కార్మికులను కలుసుకొని సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
కాంట్రాక్ట్ కార్మికుల వేతనాన్ని వేజ్ బోర్డు నిబంధనలు, లేబర్ చట్టాలకు అనుగుణంగా రూ.1200 కు పెంచాలన్నారు. సీతారామ ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ నిర్మాణం చాలా ఆలస్యమవుతున్నదని కవిత అన్నారు. సత్తుపల్లి మండలంలోని యాతాలకుంటలో సీతారామ ఎత్తిపోతల పథకం 9వ ప్యాకేజీలో భాగమైన టన్నెల్‌ను కవిత పరిశీలించారు.
