మేడిగడ్డ బ్యారేజీ కొట్టుకుపోవాలని కాంగ్రెస్ చూస్తుంది : కేటీఆర్

మేడిగడ్డ బ్యారేజీ కొట్టుకుపోవాలని కాంగ్రెస్ చూస్తుంది : కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: భారీ వరదలు వస్తే మేడిగడ్డ బ్యారేజీ కొట్టుకుపోతుందేమోనని బీఆర్‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే కోరుకుంటోందని ఆయన ఆరోపించారు. అందుకే బ్యారేజీకి రిపేర్లు చేయించడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే, ఎలాంటి కుట్ర లేకపోతే వానకాలంలోగా బ్యారేజీకి రిపేర్లు చేయించాలన్నారు. కాఫర్ డ్యామ్ కట్టి 4 నెలల్లో రిపేర్లు పూర్తి చేయాలన్నారు. అప్పుడే బ్యారేజీ సేఫ్​గా ఉంటుందన్నారు. ఈ విషయంలో తమ సలహాలు వద్దనుకుంటే, నిపుణుల కమిటీ వేసి వారి సూచనలు తీసుకోవాలన్నారు. గురువారం తెలంగాణ భవన్‌‌లో కేటీఆర్​ మీడియాతో చిట్ చాట్ చేశారు. 

గతంలోనూ అనేక ప్రాజెక్టుల్లో మేడిగడ్డ లాంటి ఘటనలు జరిగాయని, అప్పటి ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యలు చేపట్టి ప్రాజెక్టులను తిరిగి ప్రజలకు అందుబాటులోకి తెచ్చాయన్నారు. కానీ, ఇప్పటి ప్రభుత్వం బ్యారేజీ కొట్టుకుపోవాలని, తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని కోరుకుంటోందని ఆరోపించారు. రాజకీయ పగలు ఉంటే తమపై చూపించాలి తప్ప.. బ్యారేజీలపై కాదని కేటీఆర్ హితవు పలికారు. బ్యారేజీ కుంగుబాటు కారణాలను అన్వేషించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్‌‌డీఎస్‌‌ఏ) ఇప్పటి వరకు ఒక్క శాంపిల్ కూడా సేకరించలేదని కేటీఆర్ ఆరోపించారు. ఒకవేళ సేకరించి ఉంటే రిపోర్ట్ ఎప్పుడొస్తుందో ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌‌ కుమార్‌‌ ‌‌రెడ్డి చెప్పాలన్నారు.

అది పొలిటికల్ మోటివేటెడ్ రిపోర్ట్‌‌

గతంలో ఎన్‌‌డీఎస్‌‌ఏ పొలిటికల్ మోటివేటెడ్ రిపోర్ట్ ఇచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. అందుకే ప్రభుత్వానికంటే ముందు మీడియాకు చేరిందన్నారు. ఆ రిపోర్టును సాకుగా చూపించి, బ్యారేజీని రిపేర్ చేయించుకుండా వదిలేస్తున్నారని ఆయన అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థలపై కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్‌‌ కు ఎందుకంత నమ్మకం అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈడీ, సీబీఐపై కూడా అంతే నమ్మకం ఉందా? ఉత్తమ్ చెప్పాలన్నారు. ఇరిగేషన్ మంత్రికి బ్యారేజీకు, రిజర్వాయర్‌‌‌‌కు తేడా కూడా తెల్వదని ఎద్దేవా చేశారు. రైతులను ఆదుకోవాలన్న కామన్‌‌ సెన్స్‌‌ ప్రభుత్వానికి లేదని కేటీఆర్ విమర్శించారు. సెన్స్ ఉంటే వెంటనే మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేయించి.. కిందికి పోతున్న నీళ్లను ఎత్తిపోసేందుకు ఒక్క పంపునైనా స్టార్ట్ చేసి నీళ్లు అందించాలన్నారు. ప్రభుత్వానికి చేతగాకపోతే, తమకు అప్పగించాలని, తాము రిపేర్ చేసి చూపిస్తామన్నారు. పిల్లర్ల కుంగుబాటుపై విచారణ చేస్తే తమకేమీ అభ్యంతరం లేదన్నారు. కక్షపూరితంగా వ్యవహరిస్తే కోర్టుల్లో కొట్లాడుతామని కేటీఆర్ వెల్లడించారు. తమ సలహాలను పట్టించుకోని సర్కార్, సునీల్ కనుగోలు సలహాలు తీసుకుంటోందని ఆయన ఆరోపించారు. తమ మేడిగడ్డ యాత్ర నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే పాలమూరు యాత్ర పేరిట పోటీ యాత్రకు కాంగ్రెస్ సిద్ధమైందని విమర్శించారు. వెదిరె శ్రీరామ్ భువనగిరి లోక్‌‌సభ సీటు కోసం తాపత్రయ పడుతున్నాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అప్పుడు అనుమతులు ఇచ్చి, ఇప్పుడు ఇవ్వలేదంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 400 అనుమతులు తీసుకున్నామని ఆయన వెల్లడించారు.

బీజేపీకి రేవంత్ సహకరిస్తున్నడు

కేంద్రంలో ఉన్న బీజేపీకి రేవంత్‌‌ పరోక్షంగా సహకరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ‘‘లోక్‌‌సభ ఎన్నికల తర్వాత ఆయన ఎటు పోతారో అందరూ చూస్తారు. హిమాచల్‌‌ప్రదేశ్‌‌ లో లాగా భవిష్యత్తులో ఇక్కడా రాజకీయం రంజుగా ఉంటుంది. లంకె బిందెలు ఎక్కడున్నాయో మనకేం తెలుసు. తెలంగాణ తల్లి మీద ఆభరణాలు మాత్రం మాయం చేశాడు’ అని కేటీఆర్‌‌ విమర్శించారు. ‘రాజకీయ పార్టీల్లో చేరికలను బూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. పోరాటవాదులు పార్టీతో ఉంటారు. అధికారవాదులు వదిలివెళ్తారు. గెలుపు గుర్రాలకే ఏ పార్టీ అయినా టికెట్లు ఇస్తుంది. ఇటీవల బీఆర్‌‌ఎస్‌‌ నుంచి కాంగ్రెస్‌‌లో చేరిన సునీత మహేందర్‌‌రెడ్డి (చేవెళ్ల), బొంతు రామ్మోహన్‌‌ (సికింద్రాబాద్‌‌), అల్లు అర్జున్‌‌ మామ కంచర్ల చంద్రశేఖర్‌‌రెడ్డి (మల్కాజిగిరి), వెంకటేశ్‌‌ (పెద్దపల్లి)కు టికెట్లు ఇచ్చే అవకాశముంది’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తమ పాలనలో ఏవైనా తప్పులు జరిగి ఉంటే రాజకీయ వేధింపులకు దిగకుండా ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చని కేటీఆర్ ​పేర్కొన్నారు.