బీజేపీ ఆఖరి అస్త్రం.. రిజర్వేషన్లు రద్దు : సీఎం రేవంత్ రెడ్డి

బీజేపీ ఆఖరి అస్త్రం.. రిజర్వేషన్లు రద్దు : సీఎం రేవంత్ రెడ్డి
  •  అందుకే అబ్ కీ బార్ చార్ సౌ పార్ నినాదం
  •  ఎస్సీ, ఎస్టీ, బీసీలు అప్రమత్తంగా ఉండాలె
  •  బీజేపీకి ఓట్లు వేస్తే రద్దుకు మద్దతు ఇచ్చినట్టే
  •  రాజ్యాంగ హక్కును కాలరాసేందుకు కుట్ర
  •  2025 నాటికి రిజర్వేషన్ల రద్దు ఆర్ఎస్ఎస్ ఎజెండా
  •  దానిని అమలు చేసేందుకు మోదీ ప్లాన్
  •  కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది..
  •  అధికారంలోకి వస్తే జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు
  •  గాంధీభవన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 
  •  బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ చార్జిషీట్

హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ  రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని, ఇదే మోదీ ఆఖరు అస్త్రమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ గాంధీభవన్ లో ఆయన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షి తో కలిసి బీజేపీ పదేండ్ల పాలనపై చార్జిషీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రేవంత్  రెడ్డి మాట్లాడుతూ.. 1925లో మొదలైన ఆర్ఎస్ఎస్ వందేండ్లలో రిజర్వేషన్లను రద్దు చేయాలని లక్ష్యంగా  పెట్టుకుందని, వచ్చే ఏడాదితో అది పూర్తవుతుందని అన్నారు. ఆ ఎజెండాను అమలు చేసేందుకు రాజ్యాంగ సవరణ జరగాలని, ఇందుకోసం మోదీకి మూడింట రెండు వంతుల మెజార్టీ కావాలని, అందుకే అబ్ కీ బార్ చార్ సౌ పార్ అనే నినాదాన్ని ఎత్తుకున్నారని అన్నారు. 

బీజేపీ విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కును కాలరాసేందుకు కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. బీజేపీకి ఓట్లు వేస్తే రిజర్వేషన్ల రద్దుకు మద్దతు ఇచ్చినట్టేనని తెలిపారు. ఇలాంటి బీజేపీకి వర్గీకరణ కోసం పోరాడే వారు ఎందుకు మద్దతు ఇస్తున్నారో తనకు అర్థం కావడం లేదని చెప్పారు. దేశంలో కులగణన చేసి జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు అమలు చేయడం అన్నది కాంగ్రెస్ పార్టీ విధానమని చెప్పారు. రిజర్వేషన్లు రద్దు, రిజర్వేషన్లు వద్దు అనుకుంటే బీజేపీకి ఓట్లు వేయాలని ఎస్సీ,ఎస్టీ, ఓబీసీలకు రేవంత్ సూచించారు. ఈ ఎన్నికలు రిజర్వేషన్లు ఉండాలా..? వద్దా..? అనే రెఫరెండంతోనే జరుగుతున్నాయని తెలిపారు.  

నల్లధనం తేలె.. 15 లక్షలు ఎయ్యలె

స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న నల్లధనాన్ని తీసుకువచ్చి పేదల ఖాతాల్లో వేస్తానని జన్ ధన్ ఖాతాలు తెరిపించిన మోదీ.. ఇప్పటి వరకు రూపాయి కూడా వేయలేదని అన్నారు. 20 కోట్ల కొలువులిస్తామని చెప్పి గద్దెనెక్కిన మోదీ.. ఇప్పటి వరకు ఇచ్చింది 7,21,687 ఉద్యోగాలు మాత్రమేనని, పార్లమెంటు సభ్యుడిగా తాను అడిగిన ప్రశ్నకు హౌస్ లో చెప్పిన సమాధానం ఇదని అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి అన్నదాతలను కార్పొరేట్ కంపెనీలకు బానిసలుగా మార్చేందుకు మోదీ యత్నించారని ఆరోపించారు. లక్షలాది మంది రైతులు ఢిల్లీని ముట్టడిస్తే ఆందోళనలకు తలొగ్గి క్షమాపణలు చెప్పి, చట్టాలను వెనక్కి తీసుకున్నారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 

ఆఖరుకు అగర్ బత్తిని కూడా ఇడ్వలే

మోదీ సర్కారు ఆఖరుకు దేవుడి దగ్గర వెలిగించే అగర్ బత్తీపైనా జీఎస్టీ విధించిందని చెప్పారు.  410 రూపాయలున్న సిలిండర్ ధర రూ. 1200కు పెరిగిందని రేవంత్ రెడ్డి చెప్పారు. 55 రూపాయలున్న పెట్రోల్ రూ. 110 అయ్యిందన్నారు. 80 రూపాయలున్న మంచినూనె రూ. 180కి ఎగబాకిందని చెప్పారు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచారని అన్నారు. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కవితకు అనర్హం అన్నట్టు.. మోదీ కాదేదీ జీఎస్టీకి అనర్హం అని అంటున్నారని విమర్శించారు. 1947 నుంచి 14 మంది ప్రధాన మంత్రులు దేశాన్ని ఎలారని, అందరు కలిసి 55 లక్షల కోట్ల అప్పు చేస్తే నరేంద్ర మోదీ ఒక్కరే 113 లక్షల కోట్ల బాకీ చేశారని చెప్పారు. 

ప్రస్తుతం దేశం 168 లక్షల కోట్ల అప్పుల్లో ఉందన్నారు. పదేండ్ల మోదీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటుతో గుణపాఠం చెబితేనే భవిష్యత్తు ఉంటుందని లేకుంటే ఇబ్బందులు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ వర్కింగ్  ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు.