పక్క పార్టీల నుంచి వస్తున్నారంటే... కాంగ్రెస్ బలపడుతున్నట్లే..

పక్క పార్టీల నుంచి వస్తున్నారంటే... కాంగ్రెస్ బలపడుతున్నట్లే..

హైదరాబాద్: ఇతర పార్టీల నుంచి నేతలు చేరుతున్నారంటే... కాంగ్రెస్ బలపడుతోందని అర్థమని కాంగ్రెస్ మాజీ ఎంపీ, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ అన్నారు. మంగళవారం జూబ్లీ హిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి ఇచ్చిన లంచ్ పార్టీకి మధు యాష్కీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పీజేఆర్ నిఖార్సైన కాంగ్రెస్ నేత అని, ఆయన కుమారుడు విష్ణువర్థన్ రెడ్డి కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నారని తెలిపారు. విష్ణువర్థన్ సేవలు పార్టీకి చాలా అవసరమని, అందుకే ఆయన్ను కలిసినట్లు స్పష్టం చేశారు. చేరికలతో కాంగ్రెస్ కు మేలు జరగనుందని, కానీ టికెట్ ఇస్తే వస్తా అనే నేతలను పార్టీలోకి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని సూచించారు. చేరికల ద్వారా ఎప్పటినుంచో పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నవాళ్లకే అవకాశమివ్వాలని కోరారు.  

నోట్ల రద్దు, నల్ల చట్టాలు వంటి ఎన్నో కార్యక్రమాలకు కేసీఆర్ మోడీకి సపోర్టు చేశారన్నారు. ఎనిమిదేళ్లుగా టీఆర్ఎస్, బీజేపీ కలిసి ప్రజలను దోచుకుంటున్నాయని ఆరోపించారు. టీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఒకరిపైనొకరు విమర్శలు చేసుకుంటూ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి పక్షనాయకులపై మోడీ ఈడీని ప్రయోగిస్తున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా రాష్ట్రంలో, దేశంలో వచ్చేది తమ ప్రభుత్వమేనని మధు యాష్కీ ధీమా వ్యక్తం చేశారు.