- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని చేర్చుకోవద్దంటూ ఆందోళన
- కార్యకర్తలు, లీడర్లను సముదాయించిన మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్/గద్వాల, వెలుగు : గద్వాల కాంగ్రెస్ లో మొదలైన చేరికల లొల్లి గాంధీ భవన్‌కు చేరింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ కావడంతో ఆయనను పార్టీలో చేర్చుకోవద్దంటూ నియోజకవర్గానికి చెందిన లీడర్లు, కార్యకర్తలు, మాజీ జడ్పీ చైర్పర్సన్, నియోజకవర్గ ఇన్ చార్జి సరిత అభిమానులు శుక్రవారం పెద్ద సంఖ్యలో గాంధీ భవన్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గతంలో తమను ఇబ్బందులకు గురిచేసిన కృష్ణమోహన్‌రెడ్డిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని నిలదీశారు. ఆయన చేరితే పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని వాపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ కార్యకర్తలు, లీడర్లను సముదాయించారు.
సీఎంతో సరిత భేటీ..
సరిత తిరుపతయ్య శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఉదయం నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవితో కలిసి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ‘పార్టీ అవసరాల దృష్ట్యా ఎమ్మెల్యేలను చేర్చుకోవడం తప్పదు. పార్టీలోకి ఎవరొచ్చినా నీకు అన్యాయం జరగదు’అని ఆమెకు సీఎం భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో సరిత వర్గీయులు మెత్తబడినట్టు తెలిసింది.
దీంతో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చేరికకు లైన్ క్లియర్ అయినట్టేనని సమాచారం. కాగా, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శుక్రవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో భేటీ అయ్యారు. దీంతో శనివారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.
