అవిభక్త కవలలను వేరు చేసి.. విజయవంతంగా ఆపరేషన్

అవిభక్త కవలలను వేరు చేసి.. విజయవంతంగా ఆపరేషన్
  • పాకిస్థాన్ అవిభక్త కవలలను వేరు చేసిన బ్రిటన్ డాక్టర్లు
  • ఆపరేషన్ విజయవంతం.. మూడు విడతల్లో సర్జరీ
  • టెన్షన్ పెట్టిన రెండో ఆపరేషన్

కలిసుంటే కలదు సుఖం అని ఓ కవి పాటలో వర్ణిస్తాడు. కానీ, అన్ని సందర్భాల్లోనూ అలా కలిసుండడంలో సుఖం లేదని కొన్ని ఘటనలు రుజువులతో సహా చూపిస్తుంటాయి. కలిసి పుట్టి అతుక్కుని బతకడం, అంటే అవిభక్త కవలలుగా ఉండడం. శరీరాలు వేరైనా ఆ రెండు శరీరాలు అతుక్కుని ఉండడం. ఇలాంటి కేసులు చాలా చాలా అరుదు. మన వీణ–వాణిలా అన్నమాట. అలాంటి నరకం నుంచి రెండేళ్ల పిల్లలకు విముక్తిని కల్పించారు బ్రిటన్​ రాజధాని లండన్​లోని గ్రేట్​ ఓర్మండ్​ స్ట్రీట్​హాస్పిటల్​ (గోష్​) డాక్టర్లు. విడతల వారీగా మూడు ఆపరేషన్లు చేసి వారికి స్వేచ్ఛా జీవితం ప్రసాదించారు. ఆ పిల్లలెవరు? ఆపరేషన్లలో వచ్చిన కష్టనష్టాలేంటి?

2017 జనవరి 7

ఇది ఆ పిల్లలిద్దరూ పుట్టిన తేదీ. పాకిస్థాన్​లోని పెషావర్​కు 50 కిలోమీటర్ల దూరంలోని హయాతాబాద్​కు చెందిన జైనబ్​ బీబీకి ఈ అవిభక్త కవలలు పుట్టారు. వాళ్లు పుట్టడానికి రెండు నెలల ముందే జైనబ్​ భర్త గుండెపోటుతో మరణించాడు. అంత పెద్ద కష్టం చాలదన్నట్టు పిల్లలు తలలు అతుక్కుని పుట్టడం ఆ కుటుంబాన్ని మరింత దు:ఖంలోకి నెట్టేసింది. అంతటి దు:ఖాన్ని పంటికింద బిగపట్టి పిల్లలు ఎంత ముద్దుగున్నరో అని మురిసిపోయింది జైనబ్​. మక్కా, సౌదీ అరేబియాల్లోని కవల కొండలైన సాఫా, మార్వాలనే పిల్లలకు పేర్లుగా పెట్టారు. ఓ నెల తర్వాత  సమీపంలోని మిలటరీ ఆస్పత్రి వైద్యులు ఆపరేషన్​ చేస్తాం గానీ, ఒక్కరే బతికే అవకాశం ఉంటుందని తేల్చి చెప్పారు. దానికి జైనబ్​ ససేమిరా అంది. ఆ టైంలోని గోష్​లో పనిచేస్తున్న పీడియాట్రిక్​ న్యూరోసర్జన్​ ఒవేస్​ జీలానీతో మాట్లాడించారు. అతడు కాశ్మీర్​కు సమీపంలోనే పుట్టడంతో జైనబ్​ కుటుంబంతో పరిచయం వేగంగా బలపడింది. అక్కడి నుంచి వాళ్ల ఆపరేషన్​కు కావాల్సిన వ్యవహారాలన్నీ మొదలయ్యాయి. గత ఏడాది ఆగస్టులో వారికి బ్రిటన్​ వీసా ఇప్పించారు. అదంతా ఓకే మరి, డబ్బుల మాటేంటి? ఫండ్​రైజింగ్​ ద్వారా జీలానీ ఎంతో కొంత సేకరించారు. మిగతా సొమ్ము ఎట్లా? అప్పుడే పాకిస్థాన్​లోని ప్రముఖ వ్యాపారవేత్త అయిన ముర్తజా లఖానీ ముందుకు వచ్చారు. సాయం చేస్తానన్నారు.

మొదటి ఆపరేషన్​ హ్యాపీ

కొన్ని నెలల పాటు వేచి చూసిన ఆపరేషన్​కు ముహూర్తం దొరికేసింది. 2018 అక్టోబర్​ 15 ఉదయం 8 గంటలు. 20 మంది డాక్టర్ల బృందం ఆపరేషన్​ థియేటర్​ దగ్గరకు వచ్చేసింది. వాళ్ల తలల్లో అతుక్కుని ఉన్న ఆర్టరీల (సిరలు)ను వేరు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఎముక, చర్మాన్ని కట్​ చేసి వేరు చేశారు. మెదడు ఓపెన్​ కాగానే మార్వా మెదడుకు కనెక్ట్​ అయిన సాఫా మెదడు ఆర్టరీని కట్​ చేశారు. అయితే, ఇది చాలా ప్రమాదకరమైనదని జీలానీ ఆందోళన వ్యక్తం చేశారు. కట్​ చేసిన ప్రతిసారీ దాని వల్ల మెదడుకు డ్యామేజ్​ జరిగే ముప్పు పొంచి ఉంటుందని చెప్పారు. అయితే, వాళ్లు ఆందోళన చెందినట్టు ఏమీ జరగలేదు. ఆర్టరీలను విజయవంతంగా వేరు చేశారు. తర్వాత తొలగించిన పుర్రె ఎముక ఫ్రేములను ప్లాస్టిక్​ సర్జన్​ ప్రొఫెసర్​ డేవిడ్​ డనవే బృందం తయారు చేసింది. మళ్లీ వాళ్ల మెదళ్లు కలవకుండా ఉండేలా మెత్తటి మెడికల్​ ప్లాస్టిక్​ షీట్​తో మెదళ్లను వేరు చేశారు. దాదాపు 15 గంటల పాటు ఆర్టరీలను వేరే చేసే ఆపరేషన్​ సాగింది.

రెండోది టెన్షన్​ పెట్టింది

మొదటి ఆపరేషన్​ అయ్యాక నెలకు రెండో ఆపరేషన్​ చేశారు. ఈ సారి రక్తనాళాలను వేరు చేయాలి. ఒక్క కోతకు పిల్లల్లో స్ట్రోక్​ వచ్చే ముప్పు ఎక్కువ. డాక్టర్లు ఆందోళన చెందినట్టే రెండో ఆపరేషన్​ బాగా టెన్షన్​ పెట్టేసింది. ఫస్ట్​ ఆపరేషన్​ వల్ల సాఫా మెడ రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టింది. దీంతో పుర్రెను ఓపెన్​ చేయగానే రక్తం ధారకట్టింది. మార్వా మెదడులోకి రక్తం వెళ్లడం తీవ్రమైంది. దాని వల్ల మార్వా గుండెపై ఒత్తిడి పెరిగింది. రక్తపోటు ఎక్కువైంది. సాఫా బీపీ మాత్రం చాలా తగ్గిపోయింది. వాళ్లను మళ్లీ మామూలు స్థితికి తీసుకొచ్చేందుకు డాక్టర్లు చాలా ప్రయత్నించారు. అప్పుడే మార్వా చాలా బలహీనమని డాక్టర్లు నిర్ధారించుకున్నారు. ఇప్పుడు మార్వాకు కీలకమైన రక్తనాళాన్ని కనెక్ట్​ చేసి ఉంచడమే మేలన్న అభిప్రాయానికి వచ్చారు. దాని వల్ల సాఫాకూ ప్రమాదమని తెలిసీ ధైర్యం చేశారు. దాదాపు 20 గంటల పాటు సాగిన ఆపరేషన్​ చివరకు మేలైన ఫలితాలతోనే ముగిసింది. డాక్టర్లు ఊపిరి పీల్చుకునేలా చేసింది. అయితే, తెల్లారి మధ్యాహ్నానికి సాఫా ఆరోగ్యం క్షీణించింది. చర్మం కమిలిపోయింది. సాఫా మెదడులో రక్తనాళం తీసిన చోటే (మార్వాకు కనెక్ట్​ చేశారు) స్ట్రోక్​ వచ్చింది. దాదాపు రెండు రోజులు ఆ చిన్నారి ఆరోగ్యం చాలా ప్రమాదకరంగానే ఉంది. తర్వాత కోలుకుంది.

ఆ రోజు రానే వచ్చింది

ఆపరేషన్​లో అసలు ఘట్టం.. తలలు వేరు చేయడం. 2019 ఫిబ్రవరి. ఫస్ట్​ ఆపరేషన్​ చేసినప్పటి నుంచి నాలుగు నెలలు. ఏడు గంటల ఆపరేషన్​. అతుక్కుని ఉన్న వారి తలల్లోని ప్రతి భాగాన్ని వేరు చేయడమే మిగిలి ఉంది. పుర్రె ఎముక, మెదడు, కణజాలాలు ప్రతి దాన్ని వేరు చేసి, విడివిడి జీవితాలివ్వడమే ఆలస్యం. చేసేశారు.. పుర్రె ఎముకను కోసేసి ఇద్దరినీ వేరు చేశారు. రక్తం పోతున్నా వాళ్ల బీపీ, గుండె కొట్టుకునే రేటు పడిపోకుండా చర్యలు తీసుకున్నారు. ఫలితం ఇప్పుడు ఇద్దరూ హ్యాపీగా వేరయ్యారు. మరి, ఆపరేషన్​ చేశాక, వాళ్ల తలలపై ఉన్న చర్మం చాలా తక్కువ. మరి, పుర్రెను ఎలా కవర్​ చేసేది? అందుకే చివరి ఆపరేషన్​కు నెల ముందే ప్లాస్టిక్​ సర్జన్​లు డేవిడ్​ డనవే, జూలింగ్​ ఓంగ్​లు చర్మం పెరిగేలా ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించారు. వాళ్ల తలల లోపల చిన్న చిన్న ప్లాస్టిక్​ బ్యాగులను ఏర్పాటు చేశారు. వాటి వల్ల కణజాలాలు సాగి కొత్త చర్మం పుట్టేలా తోడ్పడుతుంది. బ్యాగుల్లోకి సెలైన్​ను ఎక్కించి పెద్దగా చేయడం వల్ల చర్మం సాగి, పుర్రెను కవర్​ చేయడానికి దోహదం చేస్తుంది. దాదాపు ఆరు వారాల పాటు అలా ఉంచిన తర్వాత ఆపరేషన్​ చేసి వాళ్లను వేరు చేసింది గోష్​ టీం. ప్రస్తుతం సాఫా, మార్వాలు ఆరోగ్యంగా ఉన్నారు. ఇక, ఇంతకుముందు రెండు సార్లు కూడా గోష్​ డాక్టర్లు ఇలాంటి ఆపరేషన్లు చేశారు. 2011లో సూడాన్​కు చెందిన రితల్​, రితజ్​ అనే ఇద్దరు అవిభక్త కవలలను 11 నెలల వయసులో వేరు చేశారు. అంతకుముందు 2006లోనూ ఇంకో ఆపరేషన్  చేశారు.