
- 29 మంది అగ్నికి ఆహుతి.. వీరిలో ఇద్దరి చివరి చూపు కూడా దక్కలే
- పరిహారంతో సరిపెడుతున్న ప్రభుత్వం, బల్దియా
- ఘటనలు జరిగిన టైంలో హడావుడి చేసి వదిలేస్తున్న మంత్రులు, అధికారులు
సికింద్రాబాద్, వెలుగు:సికింద్రాబాద్ ప్రాంతాన్ని ఫైర్ యాక్సిడెంట్లు వెంటాడుతున్నాయి. గతేడాది మార్చి నుంచి ఇప్పటివరకు నాలుగు భారీ అగ్ని ప్రమాదాలు జరగగా 29 మంది మృత్యువాత పడ్డారు. గతేడాది మార్చి 23న బోయిగూడ స్క్రాప్ గోదాంలో జరిగిన ప్రమాదంలో 12 మంది, అదే ఏడాది సెప్టెంబర్12 సికింద్రాబాద్రూబీ హోటల్ లో మంటలు చెలరేగి 8 మంది, ఈ ఏడాది జనవరి 19 మినిస్టర్స్ రోడ్ లోని డెక్కన్ స్పోర్ట్స్మాల్ దగ్ధమై ముగ్గురు చనిపోయారు. డెక్కన్మాల్ప్రమాదంలో ఒకరి డెడ్‌బాడీ దొరకగా, బిల్డింగ్మొత్తం కూల్చేసిన తర్వాత కూడా మిగిలిన ఇద్దరి ఆచూకీ దొరకలేదు. తాజాగా గురువారం సికింద్రాబాద్ స్వప్న లోక్ కాంప్లెక్స్‌లో మంటలు అంటుకుని ఆరుగురు అమాయకులు చనిపోయారు. ఈ నాలుగు ఘటనల్లో ప్రాణ నష్టంతోపాటు భారీగా ఆస్తి నష్టం జరిగింది. వీటితోపాటు గ్రేటర్లో డైలీ ఎక్కడో చోట అగ్ని ప్రమాదాలు జరుగుతుండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఘటనలు జరిగిన టైంలో మంత్రులు, అధికారులు హడావుడి చేసి, పరిహారంతో సరిపెడుతున్నారు. డెక్కన్మాల్తగలబడినప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలో అగ్ని ప్రమాద నివారణ కమిటీ వేస్తామని చెప్పి తర్వాత గాలికి వదిలేశారు. ఆ ఘటన జరిగిన 2 నెలల్లోనే మరో భారీ అగ్ని ప్రమాదం జరిగినా చలనం లేదు.
4, 5, 6, 7 అంతస్తుల్లో తనిఖీలు
అగ్ని ప్రమాదం జరిగిన సికింద్రాబాద్ స్వప్న లోక్ కాంపెక్స్‌లో గురువారం రాత్రి 8 గంటలకు మొదలైన సహాయక చర్యలు శుక్రవారం ఉదయం 10 గంటల వరకు కొనసాగాయి. ఫైర్ సిబ్బంది, పోలీసులు టీమ్స్‌గా ఏర్పడి మంటలు అంటుకున్న 4, 5, 6, 7 అంతస్తుల్లో తనిఖీలు చేశారు. క్లూస్‌టీమ్ అన్ని రకాల ఆధారాలను సేకరించింది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగు అంతస్తులను జల్లెడ పట్టింది. సికింద్రాబాద్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు సర్వే చేశారు. కాంప్లెక్స్ బిల్డింగ్‌లో ఫైర్ సేఫ్టీని రెనోవేట్చేయకపోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోందని జీహెచ్ఎంసీ తెలిపింది. ఈ మేరకు బల్దియా కమిషనర్ లోకేశ్‌కుమార్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 1985, జులై 12న అనుమతిపొంది అన్ని నిబంధనలకు లోబడి సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్, మెజామిన్ఫ్లోర్తో పాటు 6 అంతస్తులు నిర్మించారని అందులో పేర్కొన్నారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పారు. నివేదిక ఆధారంగా షాపుల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
రెండు బ్లాకుల్లో 400 షాపులు
కాంప్లెక్స్ మొత్తం 2 బ్లాకుల్లో విస్తరించి ఉంది. 7 అంతస్తుల్లో ఉన్న ఈ బిల్డింగ్ లో దాదాపు 400 షాపులు ఉన్నాయి. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు రెండు బ్లాకులు రద్దీగా ఉంటాయి. ప్రమాదం జరిగిన బి–-బ్లాక్‌లో160 వరకు ఆఫీసులు, 200 వరకు వివిధ రకాల షాపులు ఉన్నాయి. రెండ్లు బ్లాకుల్లో సెల్లార్లు ఉండగా, వీటిలో నిబంధనలకు విరుద్ధంగా షాపులు కొనసాగుతున్నాయి. సెల్లార్ నుంచి నాలుగో అంతస్తు వరకు షాపులు, ఆ పైన ఫ్లోర్లలో వివిధ రకాల ఆఫీసులు నడుసున్నాయి. వీటిలో 3 వేల మంది వరకు సిబ్బంది పనిచేస్తుండగా, కావాల్సిన వస్తువులు, బిజినెస్పని మీద వేల సంఖ్యలో జనం వచ్చి పోతుంటారు. అయితే గురువారం మంటలు అంటుకునే టైంకు ఆఫీసుల టైం అయిపోవడంతో 5 నుంచి 7 అంతస్తుల్లోని సిబ్బంది దాదాపుగా వెళ్లిపోయారు.గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్లలో షాపుల్లో పనిచేసే సిబ్బంది, కొనుగోలుదారులు ఉన్నప్పటికీ మంటలు విషయం తెలుసుకుని బయటికి పరుగులు తీశారు. ఐదో అంతస్తులో మంటలు, దట్టమైన పొగ చుట్టుముట్టడంతో ఆరుగురు వాష్ రూమ్‌లో దాక్కున్నారు. అక్కడికి కూడా పొగ, మంటలు వ్యాపించడంతో ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారు.
ఇంజనీర్ అంచూరిపై నిర్వాహకుల దాడి
స్వప్నలోక్కాంప్లెక్స్లో మెయింటెనెన్స్ సరిగా లేదని, ఫైర్ సేఫ్టీని పాటించి ఉంటే ప్రమాదం తీవ్రత తగ్గేదని శుక్రవారం మీడియాకు వివరిస్తున్న డిజైన్ఇంజనీర్అంచూరిపై కాంప్లెక్స్‌లో షాపులు నిర్వహిస్తున్న పలువురు నిర్వాహకులు దాడికి యత్నించారు. బిల్డింగ్‌లో లోపాలు ఉన్నాయంటూ చెప్పడానికి మీరెవరు అంటూ గొడవకు దిగారు. జర్నలిస్టులతోనూ దురుసుగా ప్రవర్తించారు. లోపాల గురించి చెబితే బిల్డింగ్ మూసివేయడం గానీ, కూల్చివేయడం గానీ చేస్తారని, తమ వ్యాపారం దెబ్బతింటుందని షాపుల నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి జనం సేఫ్టీ సంగతి ఏమిటని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలాగే కాంప్లెక్స్ వెనకాల పెద్ద మురికివాడ ఉంది. ఇక్కడ దాదాపు 500కి పైగా పేద కుటుంబాలు ఉంటున్నాయి. మంటలు ఎగసి పడినంతసేపు ఈ బస్తీ వాసులు వణికిపోయారు. అగ్ని ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బీజేపీ కార్పొరేటర్లు శ్రావణ్‌కుమార్, ఆకుల శ్రీవాణి, మహేందర్ ఆరోపించారు. శుక్రవారం ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని వారు పరిశీలించేందుకు రాగా పోలీసులు అనుమతించలేదు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. డెక్కన్ మాల్ఘటన కొద్ది రోజులకే అత్యంత రద్దీగా ఉండే స్వప్నలోక్ కాంప్లెక్స్ తగలబడడం విచారకరమన్నారు. ఆరుగురు ప్రాణాలు కోల్పోతే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కనీసం స్పందించకపోవడం సిగ్గు చేటన్నారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.
బిల్డింగ్ మెయింటెనెన్స్ లేదు
40 ఏండ్ల కింద నిర్మించిన మల్టీ ఫ్లోర్ల బిల్డింగుల్లో స్వప్న లోక్ కాంప్లెక్స్ ఎంతో ఫేమస్అని ప్రముఖ బిల్డింగ్ డిజైన్ ఇంజనీర్ ఎస్పీ అంచూరి తెలిపారు. నిబంధనల ప్రకారమే బిల్డింగ్నిర్మాణం జరిగినా ఇందులోని ఫైర్ సేఫ్టీ వ్యవస్థ చాలా పాతదని, రెనోవేషన్చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాపారస్తులు ఎవరికి వారే తమ షాపుల నిర్వహణ, భద్రత చూసుకుంటున్నారని, ఫైర్ సేఫ్టీ రూల్స్పాటించడం లేదని తెలిపారు. బిల్డింగ్మెయింటెనెన్స్కూడా సరిగా లేదన్నారు. పైగా ఎంట్రన్స్, ఎగ్జిట్.. రెండింటికి ఒకేదారి ఉంది. బిల్డింగ్లోపల ఇరుకైన దారులు ఉండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.