
దీపావళికి టపాసుల అమ్మకాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని ఒకవైపు ప్రభుత్వం ఆదేశిస్తుంటే.. కొందరు అధికారులు టపాసుల వ్యాపారుల నుంచి మామూళ్లు వసూలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. గురువారం (అక్టోబర్ 16) నల్గొండ జిల్లాలో అలాంటి అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది ఏసీబీ టీమ్.
నల్లగొండ జిల్లాలో టపాసుల వ్యాపారి నుంచి రూ 8 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కాడు అగ్నిమాపక శాఖ అధికారి ఏ.సత్యనారాయణ రెడ్డి. పండుగ సందర్భంగా క్రాకర్స్ షాపు ఏర్పాటు చేయడానికి షాపు నిర్వాహకుడి నుంచి 8 వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు.
టపాసుల షాపు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి కొరకు డబ్బులు డిమాండ్ చేశాడు SFO సత్యనారాయణ రెడ్డి. దీంతో అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు బాధితుడు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు ఎస్ఎఫ్ఓ డిమాండ్ చేసిన మొత్తాన్ని ఇచ్చుకున్నాడు. అదే సమయంలో ప్లాన్ ప్రకారం దాడి చేసి సత్యనారాయణ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.