
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు, బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రం 'జటాధార'. తెలుగు-హిందీ ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ 7న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ఈ చిత్రం ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించింది. అంతే కాదు.. ఈ ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేయనున్నారని ప్రకటించి అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచింది.
మహేష్ చేతుల మీదుగా 'జటాధార' ట్రైలర్..
సూపర్ స్టార్ మహేష్ బాబు శుక్రవారం, అక్టోబర్ 17న 'జటాధార' ట్రైలర్‌ను ప్రత్యేక కార్యక్రమంలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా 'జటాధార' టీమ్ శక్తివంతమైన మోషన్ పోస్టర్‌ను కూడా విడుదల చేస్తూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. జీ స్టూడియోస్ ప్రేరణా అరోరా సమర్పణలో వస్తున్న ఈ చిత్రం పౌరాణిక అంశాలు, జానపద కథలు, అతీంద్రీయ శక్తులను అద్భుతంగా మిళితం చేసి, ప్రేక్షకులకు ఒక లీనమయ్యే సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు సిద్ధమైందని తెలిపింది.. 'జటాధార' చిత్రంలో సోనాక్షి సిన్హా ప్రధాన విలన్ పాత్రలో నటించడం విశేషం. ఈ చిత్రంతోనే ఆమె తెలుగు తెరకు పరిచయం అయింది. ఆమె పాత్ర చాలా శక్తిమంతంగా, ఉగ్రరూపంలో ఉంటుందని మోషన్ పోస్టర్ ద్వారా తెలుస్తోంది.
Our Superstar is kickstarting the storm with the #Jatadhara 🔱Trailer launch tomorrow!
— Sudheer Babu (@isudheerbabu) October 16, 2025
Jatadhara in theaters from Nov 7th!! pic.twitter.com/AnWjqXZSVR
భారీ తారాగణం
'జటాధార' చిత్రానికి వెంకట్ కల్యాణ్ , అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గత ఏడాది ఆగస్టులో అధికారికంగా ప్రకటించబడింది. ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణా అగర్వాల్, ప్రేరణా అరోరా, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా వంటి ప్రముఖులు నిర్మిస్తున్నారు. ఈ థ్రిల్లర్‌లో సోనాక్షి సిన్హాతో పాటు శిల్పా శిరోద్కర్, దివ్య ఖోస్లా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇందిరా కృష్ణ, రవి ప్రకాష్, నవీన్ నేని, రోహిత్ పాఠక్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, సుబ్బలేఖ సుధాకర్ వంటి భారీ తారాగణం ఇందులో భాగమైంది. సమీర్ కల్యాణి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
కాగా, సుధీర్ బాబు మహేష్ బాబు సోదరి ప్రియదర్శినిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గతంలో కూడా మహేష్ బాబు తన బావ చిత్రాల ప్రమోషన్లలో చురుకుగా పాల్గొని మద్దతు ఇచ్చారు. ఇప్పుడు ట్రైలర్ లాంచ్‌కు కూడా ఆయన రావడం, ఈ సినిమాకు మరింత బూస్ట్ ఇస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ చిత్రం నుండి మూడు పాటలు విడుదలయ్యాయి. అభిమానులను ఎంతో ఆకట్టుకున్నాయి. అయితే, బాక్సాఫీస్ వద్ద 'జటాధార' నవంబర్ 7న రష్మిక మందన్న నటించిన 'ది గర్ల్‌ఫ్రెండ్' చిత్రంతో పోటీ పడనుంది...