
- పథకాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్రం సర్క్యులర్
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి లేఖ
హైదరాబాద్, వెలుగు: పేదలకు ఆదాయం, ఆహార భద్రత కల్పిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే కుట్రలకు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతోందంటూ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. పథకంపై అవినీతి ముద్ర వేసేందుకు ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో తనిఖీలు ప్రారంభించిందన్నారు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి హారీశ్ రావు మంగళవారం లేఖ రాశారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర సర్కార్ ఇటీవల సర్య్కులర్ జారీ చేసిందని.. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. లేదంటే ప్రజాగ్రహానికి గురవుతారని హెచ్చరించారు. ఉపాధి హామీ పథకంలో గ్రామాల్లో 20 రకాల పనులకే అనుమతులు ఇవ్వడం.. కూలీలను అవమానపరిచేలా రోజుకు రెండు సార్లు మస్టర్ రోల్ హాజరు ఉండాలంటూ సర్క్యులర్ జారీ చేయడం పేదల నోట్లో మట్టికొట్టడమేనని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న బీజేపీ నాయకత్వం.. దేశంలో కూలీలతో పాటు తెలంగాణలో ఉన్న 57.46 లక్షల జాబ్ కార్డులు కలిగిన 1,21,33,00 మంది ఉపాధి హామీ కూలీల హక్కులు కాలరాస్తోందన్నారు.
రాష్ట్రాలకు బకాయిలు
చేసిన పనులకు రాష్ట్రాలకు భారీగా బకాయిలు పేరుకుపోయాని మంత్రి హరీశ్ లేఖలో వివరించారు. దేశవ్యాప్తంగా కూలీల రావాల్సిన రూ.10 వేల కోట్ల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర మంత్రి ఇటీవల రాజ్యసభలో చెప్పారని గుర్తుచేశారు. 15 రాష్ట్రాల్లోనే రూ.4700 కోట్లు , తెలంగాణ కు రూ.83 కోట్లుచెల్లించలేదని అంగీకరించడం వాస్తవం కాదా అన్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులుగా పోటీ చేసి ఓడిపోయిన వారందరికీ ఈ పథకంపై పర్యవేక్షణ అధికారాలు కల్పించడం ఏంటి అన్నారు? వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం చేయాలని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే కేంద్రం పట్టించుకోలేదన్నారు.