‘మంత్రి హత్యకు కుట్ర’ కేసు.. పొంతనలేని రిపోర్టులు

‘మంత్రి హత్యకు కుట్ర’ కేసు.. పొంతనలేని రిపోర్టులు
  • రెండు రిమాండ్ రిపోర్టుల్లో వివరాలు గందరగోళం
  • కుట్ర గురించి మంత్రి శ్రీనివాస్​గౌడ్​ అనుచరులు ఫరూక్, గులాంకు ముందే తెలుసా?
  • ప్లాన్ తెలిసినా పోలీసులకు ఫిర్యాదు చేయలేదా?
  • మంత్రిని కూడా అలర్ట్ చేయలేదా?
  • కంప్లెయింట్​లో ఒకమాట.. స్టేట్ మెంట్​లో మరోమాట
  • నిందితులపై వేధింపులకు మంత్రి సహకరించారా?
  • రూ. 15 కోట్ల సుపారీ మాట.. రిమాండ్ రిపోర్ట్ లో గల్లంతు
  • 23న కిడ్నాపైన వ్యక్తి 25న దాడికి పాల్పడ్డట్లు రిపోర్ట్
  • రెండు తుపాకులు దాచడానికి మూడు అడవుల పేర్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సంచలనం రేపిన ‘మంత్రి శ్రీనివాస్ గౌడ్  హత్యకు కుట్ర’ కేసులో చాలా వివరాలు అంతుబట్టకుండా ఉన్నాయి. ఈ కేసులో పోలీసులు దాఖలుచేసిన రెండు రిమాండ్ రిపోర్టుల్లో ప్రస్తావించిన వివరాలు చాలావరకు పొంతన లేకుండా ఉన్నాయి. ఒక రిపోర్టులో ఉన్నది మరో రిపోర్టులో మారిపోగా, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన వివరాల్లో కీలక అంశాలు అసలు రిమాండ్ రిపోర్టులో లేవు. గత నెల చివరివారంలో మహబూబ్ నగర్ లో ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్​ కావడం, ఇది పత్రికల్లో రావడం, మూడురోజుల తర్వాత వారిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించినట్లు సైబరాబాద్ పరిధిలోని పేట్ బషీరాబాద్ పోలీసులు చెప్పడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆపై రెండు రోజులకే ఢిల్లీలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి క్వార్టర్స్ లో మరో నలుగురు వ్యక్తులు కిడ్నాప్ కావడం, దానిపై ఢిల్లీ పోలీసులు కేసు బుక్ చేయడం, రెండురోజుల తర్వాత అదే కేసులో అరెస్టులని రాష్ట్ర పోలీసులు ప్రకటించారు. దీనిపై అపోహలు ప్రచారంలో ఉన్నాయని చెప్తూ సీపీ కొన్ని వివరాలు చెప్పారు. మంత్రిని హత్య చేసే కుట్ర జరిగిందని ఆయన ప్రకటించడం సంచలనం రేపింది. 

సీపీ నేరుగా లీడర్ల పేర్లు చెప్పకున్నా.. బీజేపీ లీడర్లు జితేందర్ రెడ్డి, డీకే అరుణపై మీడియా ప్రతినిధులు అడిగిన తర్వాత స్పందించారు. ఇన్వెస్టిగేషన్ తర్వాతే ఎవరి పాత్ర ఉందో తెలుస్తుందన్నారు. దీంతో ఇది రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. మహబూబ్ నగర్ అరెస్టులపై గత నెల 27న ఒక రిమాండ్ రిపోర్ట్ ను, ఢిల్లీ అరెస్టులపై ఈ నెల 2న మరో రిమాండ్ రిపోర్టును పోలీసులు రూపొందించారు. 2నే ప్రెస్ మీట్​లో సీపీ మాట్లాడారు.

  • గులాం హైదర్ ను చంపే లక్ష్యంతో వెపన్స్ కోసం నిందితులు తనను కలిశారని మహ్మద్ ఫరూక్ ఫిర్యాదులో పోలీసులకు చెప్పాడు. తర్వాత గులాంతో పాటు అతడికి అండగా ఉంటున్న మంత్రిని కూడా చంపడానికి వెపన్స్ లేదా సుపారీ గుండాలను అడిగారని మార్చి చెప్పాడు. 
  • మంత్రి హత్యకు కుట్ర గురించి తెలిసిన ఫరూక్ అదే విషయాన్ని ముందే పోలీసులకు ఎందుకు చెప్పలేదు? రెండో రిమాండ్ రిపోర్టులో గులాం హైదరే మంత్రిపై కుట్ర గురించి చెప్పినట్లు రాశారు. కుట్ర గురించి తెలిసిన గులాం కూడా పోలీసులకు ముందే ఈ విషయం ఎందుకు చెప్పలేదు?
  • నిజానికి ఫరూక్, గులాం ఇద్దరూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు అనుచరులే. తమ నాయకుడిపై కుట్ర జరుగుతుంటే ఈ ఇద్దరూ ముందుగా ఆయనకు కూడా ఎందుకు చెప్పలేదు? గులాం తన ప్రాణం కాపాడుకోవడానికే ఫరూక్ సాయంతో లాడ్జీలో దాక్కున్నట్లు చెప్పడం విశేషం.
  • క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఉన్న ఫరూక్ ఆయుధాలు అమ్మడంలో సాయం చేస్తాడని నిందితులు అతడ్ని కలిసినట్లు రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. మంత్రి అనుచరుడైన ఫరూకే ఆయనపై కుట్రకు సాయం చేస్తాడని నిందితులు అనుకున్నారా? మంత్రి అనుచరుడని తెలియకుండానే అతడికి క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఉందని, అక్రమంగా వెపన్స్ కొనడానికి సాయం చేస్తాడని నిందితులు తెలుసుకున్నారా?
  • సుచిత్ర జంక్షన్ దగ్గర పట్టపగలు మధ్యాహ్నం 2 గంటలకు ముగ్గురు నిందితులు ‘చంపండి’ అని అరుస్తూ కత్తులతో వెంటపడితే ప్రత్యక్ష సాక్షులు ఒక్కరూ లేరా? దగ్గర్లో సీసీ కెమెరాలు ఒక్కటీ లేవా?
  • నిజానికి నిందితులు అడిగినట్లు ఫరూక్ వారికి వెపన్స్ ఇవ్వలేదు. 25న కంప్లెయింట్ ప్రకారం చూస్తే.. నిందితులు అతడ్ని కత్తులతో వెంటాడారు. ఇందులో నిషేధిత మారణాయుధాలు లేకుండానే మొదటి రిమాండ్ రిపోర్ట్ లో ఆర్మ్స్ యాక్ట్ 25(1) ఎందుకొచ్చింది?
  • రెండో రిమాండ్ రిపోర్ట్ ప్రకారం చూస్తే.. నిందితులు రాఘవేందర్ రాజు, మున్నూరు రవి ఇద్దరూ సుచిత్ర జంక్షన్ స్పాట్ దగ్గర్లోనే దాక్కుని ఉన్నారు. వారి దగ్గర అప్పటికే వెపన్స్ ఉన్నాయి. మరి, ఫరూక్ ఇవ్వకపోయినా వారి దగ్గరికి వెపన్స్ ఎట్లొచ్చాయి? వెపన్స్ ఉన్నా కూడా వాటిని దాచి, గులాంపై కత్తులతో చంపడానికి ప్రయత్నించారా?
  • నిందితుల్లో ఒక్కరు కూడా ఆర్థికంగా బలంగా ఉన్నవారు కాదు. వీళ్లు రూ. 15 కోట్లు డీల్ ఆఫర్ చేసినట్లు సీపీ చెప్పారు. సీపీ ప్రెస్ మీట్​లో  చెప్పిన ఈ విషయాన్ని రెండో రిమాండ్ రిపోర్ట్ లో ఎక్కడా ప్రస్తావించలేదు.
  • మంత్రిని ఫరూక్ స్వయంగాగానీ, సుపారీ ముఠాతోగానీ చంపించాలని అడిగినట్లు సీపీ చెప్పారు. రెండో రిపోర్ట్ ప్రకారం.. ఫరూక్ ఆయుధాలు ఇవ్వాలని, లేదా సుపారీ గూండాల కాంటాక్ట్ ఇవ్వాలని అడిగినట్లుగా రాశారు.
  • మొదటి రిమాండ్ రిపోర్ట్ ప్రకారం.. మంత్రి అనుచరుడైన గులాం వల్లే తాము ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయామని, కుటుంబాలను వేధిస్తున్నారని నిందితులు ఫరూక్ కు చెప్పారు. విచిత్రంగా రెండో రిమాండ్ రిపోర్ట్ లో.. గులాంతో పాటు మంత్రి కూడా నిందితుల్ని దెబ్బతీయడానికి సహకరించారని చెప్పినట్లు రికార్డు చేశారు.
  • మొదటి రిపోర్ట్ లో మంత్రి పేరు లేకుండా ఒక వీఐపీకి దగ్గరి మనిషిగా గులాం హైదర్  పేరు రాశారు. రెండో రిపోర్ట్ లో మాత్రం మంత్రి అనుచరుడని, ఏకంగా మంత్రిపై కుట్ర జరిగినట్లుగా కేసు మారింది.
  • నాగరాజు అరెస్టు తర్వాత దొరికిపోతామని భయపడి నిందితులు ఢిల్లీలో షెల్టర్ తీసుకున్నారని సీపీ చెప్పారు. రెండో రిమాండ్ రిపోర్ట్ లో మాత్రం.. మంత్రిపై కుట్రలో భాగంగా ఢిల్లీలో షెల్టర్ తీసుకొని సరైన టైం కోసం ఎదురుచూస్తున్నారని రాశారు. 
  • జితేందర్ రెడ్డి డ్రైవర్ థాపాకు కుట్ర గురించి తెలుసని, తెలిసినా షెల్టర్ ఇచ్చాడని రెండో రిమాండ్ రిపోర్ట్ లో రాశారు. థాపాకు తెలుసో లేదో తెలియదని సీపీ చెప్పారు. అయితే థాపాకు ఇప్పటికే బెయిల్ వచ్చి విడుదల కావడం విశేషం.
  • మొదటి రిపోర్ట్ లో నిందితులను గులాం వేధించాడని, రెండో రిపోర్ట్ లో గులాం వేధింపులకు మంత్రి సహకారం ఉందని రాశారు. అయితే మంత్రిపై కుట్రకు కారణం తెలియదని సీపీ చెప్పారు.
  • ఢిల్లీ సౌత్ ఎవెన్యూ పోలీసులకు ఫోన్లో సమాచారం ఇచ్చినట్లు సీపీ చెప్పారు. రెండో రిపోర్ట్ లోనూ అదే రాశారు. అయితే దీన్ని ఢిల్లీ పోలీసులు నిర్ధారించట్లేదు. అక్రమంగా కిడ్నాప్ చేసినట్లుగానే ఢిల్లీ పోలీసులు కేసు బుక్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
  • రాఘవేంద్రరాజు, విశ్వనాథ్ లాంటివాళ్లు గతంలోనే మంత్రి శ్రీనివాస్ గౌడ్ వల్ల తమకు ప్రాణహాని ఉందని మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. వాళ్లు ఇప్పుడు ఆ మంత్రిపైనే కుట్ర చేసినట్లుగా చెప్తున్న కేసులో నిందితులుగా ఉన్నారు. తమకు ప్రాణహాని ఉందని గతంలో కమిషన్​ను ఆశ్రయించిన విషయం రెండు రిమాండ్ రిపోర్టుల్లో ఎక్కడా లేదు.

రెండు తుపాకులు దాచడానికి మూడు అడవుల పేర్లు
ఫరూక్, గులాంపై దాడియత్నం తర్వాత నిందితుల దగ్గరున్న పిస్టల్, రివాల్వర్‌‌‌‌‌‌‌‌ను బౌరాంపేట్ ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌లోని పొదల్లో దాచారని రెండో రిపోర్ట్‌‌‌‌లో రాశారు. అదే రిపోర్ట్‌‌లో నిందితులను పట్టుకున్న తర్వాత బహదూర్ పల్లి ఫారెస్ట్ లోని పొదల్లో రికవరీ చేసినట్లు రికార్డు చేశారు. దుండిగల్ ఫారెస్ట్ ఏరియాలో రికవర్‌‌‌‌ చేసినట్లు సీపీ చెప్పారు.

ఫిబ్రవరి 23, 24 తేదీల్లో మహబూబ్ నగర్ లో నాగరాజు, విశ్వనాథ్, యాదయ్య అనే వ్యక్తులు కిడ్నాపైనట్లు కుటుంబీకులు, సన్నిహితులు చెప్పారు. 23న సాయంత్రం 6 గంటలకే నాగరాజు భార్య ఫిర్యాదుపై టూటౌన్ స్టేషన్​లో ఎఫ్ఐఆర్ ఉంది. దీనిపై తర్వాతరోజే పత్రికల్లో కథనాలు వచ్చాయి. ముందే కిడ్నాపైన ముగ్గురే 25న మధ్యాహ్నం తమపై హత్యాయత్నం చేశారని అదేరోజున సాయంత్రం ఫరూక్, గులాం ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత 26న మధ్యాహ్నం సుచిత్ర ఏరియాలోనే ఓయో లాడ్జీలో నిందితులు దొరికారని ఫస్ట్ రిపోర్ట్ లో రాయడం విశేషం.