వీఎంహోం అనాథ పిల్లలపై దాడులు చేస్తే ఊరుకోం : పూర్వ విద్యార్థులు

వీఎంహోం అనాథ పిల్లలపై దాడులు చేస్తే ఊరుకోం : పూర్వ విద్యార్థులు

సరూర్ నగర్ పరిధిలోని విక్టోరియా మెమోరియల్‌ (వీఎం) హోంలో అనాథ పిల్లలపై దాడులు చేస్తే ఊరుకోమని పూర్వ విద్యార్థులు తేల్చి చెప్పారు. దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు విద్యార్థి సంఘాలు, వీఎం హోం పూర్వ విద్యార్థుల అసోసియేషన్ సభ్యులు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి  వ్యవహరించటం  సరికాదన్నారు. వీఎం హోం గ్రౌండ్ లోకి ఎలాంటి అనుమతి లేకుండా ప్రైవేట్ వ్యక్తులు, వాకర్స్, ప్రైవేటు పోలిస్ ట్రైనింగ్ సెంటర్ విద్యార్ధులు వస్తున్నారని తెలిపారు. వాకింగ్, రన్నింగ్ ప్రాక్టీస్ పేరుతో  వచ్చి హోంలో  ప్రస్తుతం చదువుతున్న విద్యార్ధులపై దాడులు చేస్తున్నారన్నారు. 

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రోద్బలంతోనే  వీఎం హోం స్థలాన్ని వాకర్స్ ట్రాక్ గా  మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సుధీర్ రెడ్డి దగ్గరుండి హోం స్థలంలోకి జేసీబీని తీసుకురావడంపై పూర్వ విద్యార్ధులు, హోం పర్యవేక్షణ అధికారి అభ్యంతరం వ్యక్తం చేశారు. హోంలో చదువుకునే అనాథ విద్యార్థులపై ప్రైవేట్ వ్యక్తులు వచ్చి దాడి చేయడంపై సరూర్ నగర్  పీఎస్ లో తాము ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. వీఎం హోం ఆస్తులు పూర్తిగా అనాథ విద్యార్థులకు సంబంధించినవని, అవి అన్యాక్రాంతం కాకుండా కాపాడడం పూర్వ విద్యార్థులుగా తమ బాధ్యత అన్నారు. హోం  ఆస్తులను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. 

అన్యాక్రాంతం కాకుండా చూసుకుంటాం : సూపరింటెండెంట్

వీఎం హోం 73 ఎకరాల్లో విస్తరించి ఉందని హోం సూపరింటెండెంట్ లక్ష్మీపార్వతి తెలిపారు. స్ధలం అన్యాక్రాంతం కాకుండా చూసుకుంటామన్నారు. ఉదయం 7 గంటలకు ఎక్సర్ సైజ్ కోసం విద్యార్ధులు గ్రౌండ్ లో ఉన్నారన్నారు. ఆ సమయంలో కోచింగ్ సెంటర్ విద్యార్ధులు దూసుకొచ్చే ప్రయత్నం చేశారన్నారు. ఇందులో హోం ఇద్దరు విద్యార్ధులను గాయపర్చారని తెలిపారు. ప్రైవేటు వ్యక్తులు హోంలోకి ఎలా ప్రవేశిస్తారని ప్రశ్నించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. దుర్మార్గంగా వ్యవహరించడం సబబు కాదన్నారు.

వీఎం హోం ఆస్తులను కాపాడే బాధ్యత మాకుంది : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

వీఎం హోం ఆస్తులను కాపాడే బాధ్యత తమకు ఉందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వెల్లడించారు. హోం విద్యార్ధులు, వాకర్స్ లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఇక్కడ నెలకొన్న సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత హోం నిర్వాహకులదన్నారు. కానీ.. ఏవో కారణాలు చెప్పి తప్పించకూడదన్నారు. చెత్తాచెదారాన్ని క్లీన్ చేయాలని అడగాలంటే... సెక్రటేరియట్ కు వెళ్లాలా ? అని ప్రశ్నించారు. గ్రౌండ్ ను విద్యార్ధులు, ప్రైవేటు వ్యక్తులు ఉపయోగించుకోవడానికి తగిన సమయం కేటాయించామన్నారు. వీఎం హోంకు సంబంధించిన ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా చూసుకొనే బాధ్యత అందరిదన్నారు.