ఖమ్మం, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ, ఓట్ల తొలగింపు పేరిట కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు కుట్రపూరిత రాజకీయాలు చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది.
ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల సహ ఇన్‌చార్జి సచిన్ సావంత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌ను అడ్డం పెట్టుకుని బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.
దళిత, గిరిజన, మైనార్టీ వర్గాల ఓట్లను లక్ష్యంగా చేసుకుని సుమారు 68 లక్షల ఓట్ల తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ కుట్రలను తిప్పికొట్టేందుకు రాబోయే 4-5 రోజుల్లో బూత్ స్థాయి కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు.
ప్రభుత్వంపై ప్రతిపక్షాలు సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం చేస్తున్నాయని, వాటిని కాంగ్రెస్ శ్రేణులు సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి అత్యధిక స్థానాలు గెలిచి రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యమన్నారు. సచిన్ సావంత్ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ఫేజ్-2పై నియోజకవర్గాల వారీగా జరుగుతున్న సన్నద్ధతను సమీక్షించారు.
బూత్ స్థాయి వరకు స్పష్టమైన బాధ్యతలు కేటాయించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నెల 25లోపు మండల, టౌన్, గ్రామ కమిటీలను పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, ఖమ్మం ఎంపీ రఘురామ్ రెడ్డి, ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకటరావు, రాందాస్ నాయక్, ఖమ్మం కార్పొరేషన్ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, కిసాన్ కమిషన్ సభ్యులు రాంరెడ్డి గోపాల్ రెడ్డి, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
