- రాజ్యాంగ హక్కులను తుంగలో తొక్కేలా వక్ఫ్ బోర్డ్ చట్టానికి సవరణ
- ఈ బోర్డ్‌కు చెందిన భూములను తమ కంట్రోల్‌లోకి తెచ్చుకునేందుకు బీజేపీ ప్రయత్నం
- ఒక వర్గాన్ని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని ఫైర్
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రంలోని బీజేపీ సర్కార్ దేశంలోని హిందు ముస్లింలను విభజించే కుట్ర చేస్తోందని, ఇది దేశానికి మంచిది కాదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఈ రోజు ముస్లింలతో ప్రారంభించిన బీజేపీ.. భవిష్యత్‌లో సిక్కులు, బౌద్ధులు, జైనులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను నిర్వీర్యం చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టంపై గురువారం సెషన్ ప్రారంభానికి ముందు పార్లమెంట్‌లో లోక్‌సభ పక్షనేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఎంపీలతో సమావేశమయ్యారు.
ఇందులో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, కడియం కావ్య, చామల కిరణ్ కుమార్, సురేశ్ షట్కర్ తదితర ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డు సవరణ చట్టంతో భవిష్యత్‌లో కలిగే అనర్థాలు, బీజేపీ కుట్రపూరిత ఆలోచనను రాహుల్ వివరించారు. ఈ అంశంపై సభ లోపల, బయట అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు.
కాగా, లోక్‌సభలో వక్ఫ్ బోర్డు సవరణ చట్టం ఆమోదం తర్వాత పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఈ సవరణ చట్టాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. బీజేపీ కుట్రల కారణంగా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంత విలువైందో ఈ సవరణ బిల్లు ద్వారా మరోసారి రుజువైందన్నారు. సెక్షన్ 40ని తొలగించడమంటే.. వక్ఫ్ బోర్డు ఉన్నా లేనట్లేనని అన్నారు.
వక్ఫ్ బోర్డ్ భూముల కోసం..
దాదాపు 10 లక్షల ఎకరాలతో దేశంలోనే మూడో అతిపెద్ద భూములు కలిగిన బోర్డుగా వక్ఫ్ బోర్డు ఉందని వంశీకృష్ణ పేర్కొన్నారు. ఈ భూములను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని బీజేపీ చూస్తున్నదని మండిపడ్డారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ తన నినాదం అన్న మోదీ.. ఇప్పుడు ఒక వర్గాన్ని టార్గెట్ చేయడం సరికాదన్నారు. ఇదే విషయాన్ని లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిందని చెప్పారు. అందుకే బీజేపీ 240 సీట్ల దగ్గరే ఆగిపోయిందని, అయినా మిత్ర పక్షాల అండంతో బిల్లును ఆమోదించుకుందన్నారు. రాజ్యాంగాన్ని కూడా బీజేపీ మారుస్తుందని తాము చెప్పామని, ఈ రోజు సవరణల పేరుతో అదే చేస్తోందన్నారు.
రాజ్యాంగానికి మాయని మచ్చ
భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ప్రజాస్వామ్య దేశంలో సెక్యులరిజానికి వ్యతిరేకంగా బీజేపీ వక్ఫ్ బోర్డు చట్టానికి సవరణ చేయడం రాజ్యాంగానికి మాయని మచ్చ అని వంశీకృష్ణ అన్నారు. మన దేశం ఒక సెక్యులర్ కంట్రీ అని, ప్రతి మతానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 25, 26, 30 రక్షణ కల్పిస్తున్నాయని చెప్పారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను తుంగలో తొక్కెలా తాజా సవరణ చేశారని దుయ్యబట్టారు.
ముస్లిం మత గౌరవాన్ని కాలరాసేలా చట్ట సవరణ ఉందన్నారు. ముస్లింలకు అండగా ఉంటుందని 1957లో అప్పటి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ వక్ఫ్ చట్టాన్ని తెచ్చారని, కానీ, బీజేపీ ప్రభుత్వం ఈ బోర్డును తమ చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. మతపరమైన విశ్వాసంలో మసీదు, దర్గాలకు రక్షణగా వక్ఫ్ బోర్డు ఉందని తెలిపారు. నాన్ ముస్లింలను బోర్డులోకి తీసుకొచ్చి, వారి ద్వారా ఆ వర్గాన్ని కంట్రోల్ చేయాలనే యోచనలో ప్రధాని మోదీ ఉన్నారని ఆరోపించారు.
