ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు 2,500 కోట్లు చెల్లింపు

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు 2,500 కోట్లు చెల్లింపు
  • ఆరు నెలల్లో 2.25 లక్షల ఇండ్ల నిర్మాణం ప్రారంభం
  • త్వరలో సిమెంట్, స్టీలు రేట్లు ఖరారు
  • హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఆరు నెలల కాలంలో లబ్ధిదారులకు రూ.2,500 కోట్లు చెల్లించినట్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ వెల్లడించారు. స్కీమ్ ను గత జనవరి నెలలో ప్రారంభించామని.. మే నెలలలో ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. కేవలం ఆరు నెలల కాలంలోనే బేస్మెంట్ నిర్మాణాల కోసం రూ. 1,519 కోట్లు, గోడల నిర్మాణం కోసం రూ.561 కోట్లు, స్లాబుల కోసం రూ. 444 కోట్లు చెల్లించినట్లు ఆయన  తెలిపారు.  

ఇప్పటికే 2.25 లక్షల ఇండ్ల నిర్మాణం  స్టార్ట్ అయ్యిందన్నారు. మంగళవారం హిమాయత్‌‌‌‌ నగర్‌‌‌‌లోని హౌసింగ్ కార్పొరేషన్ ఆఫీస్‌‌‌‌ లో మీడియాతో ఎండీ గౌతమ్ మాట్లాడారు.  ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇండ్లకు నిధులు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి పర్యవేక్షణలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొనసాగుతున్నదన్నారు. 

రాష్ట్రంలోని 11 వేల గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఇండ్ల పనులు సాగుతున్నాయని ఎండీ తెలిపారు. ఇప్పటివరకు 29 వేల ఇండ్ల స్లాబ్‌‌‌‌లు కంప్లీట్ అయ్యాయని.. ఒక్కో ఇంటి నిర్మాణంతో పది నుంచి ఇరవై మందికి ఉపాధి దొరుకుతున్నదని ఆయన చెప్పారు. కాల్ సెంటర్‌‌‌‌ కు గతంలో రోజుకు 5 వేల కంప్లైంట్స్ వచ్చేవని, ఇప్పుడు అవి 2,500 కు తగ్గాయన్నారు. జిల్లాల నుంచి ఇసుక కొరత ఉందని కంప్లైంట్స్ వస్తున్నాయని, త్వరలో ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తామని ఎండీ గౌతమ్​తెలిపారు.