- 2018లో మంచిర్యాల-అంతర్గాం బ్రిడ్జి సాంక్షన్ చేసిన సర్కారు
- పనులు స్టార్ట్ అయ్యాక కాన్సల్చేయించిన ఎమ్మెల్యే పీఎస్సార్
- ముల్కల్ల–ముర్మూర్ మధ్య మరో బ్రడ్జికి రూ.450 కోట్లతో ప్రపోజల్స్
- పాతది రద్దయి ఏడాదవుతున్నా కొత్త బ్రిడ్జి కోసం ఎదురుచూపులే
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల మధ్య గోదావరి నదిపై హైలెవల్బ్రిడ్జి నిర్మాణం కలగా మిగిలింది. ఈ బ్రిడ్జి నిర్మాణంతో రెండు జిల్లా కేంద్రాల నడుమ దూరం తగ్గడమే కాకుండా రవాణా సౌకర్యం మరింత మెరుగవుతుంది. కానీ ప్రజాప్రతినిధుల తీరుతో ఎనిమిదేండ్లుగా ఎలాంటి ప్రోగ్రెస్ లేకుండా పోయింది.
ఎనిమిదేండ్ల క్రితం మంచిర్యాల–అంతర్గాం బ్రిడ్జిని సాంక్షన్ చేసిన బీఆర్ఎస్ సర్కారు ఆ తర్వాత పట్టించుకోలేదు. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తది కడుతామంటూ పాత బ్రిడ్జిని క్యాన్సల్ చేసింది. నేటికి ఏడాదవుతున్నా ముందడుగు పడకపోవడంతో రోజురోజుకు ఆశలు సన్నగిల్లుతున్నాయి.
ఎనిమిదేండ్ల క్రితం సాంక్షన్
మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలను కలుపుతూ గోదావరిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని చాలాకాలంగా డిమాండ్ ఉంది. ఈ క్రమంలో 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అప్పటి సీఎం కేసీఆర్‌రూ.125 కోట్లతో మంచిర్యాల–అంతర్గాం బ్రిడ్జిని సాంక్షన్చేస్తున్నట్టు ప్రకటించారు. రెండోసారి బీఆర్ఎస్గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి కేసీఆర్ మళ్లీ సీఎం అయినప్పటికీ బ్రిడ్జికి మోక్షం కలగలేదు.
ప్రజలు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడంతో 2023 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నాలుగేండ్ల క్రితం పనులకు గ్రీన్సిగ్నల్ఇచ్చారు. అంచనా వ్యయాన్ని రూ.125 కోట్ల నుంచి రూ.164 కోట్లకు పెంచి టెండర్కాల్చేయగా వల్లభనేని కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్ట్దక్కించుకుంది. వెంటనే సాయిల్ టెస్టింగ్ చేసి బ్రిడ్జి వర్క్‌స్టార్ట్ చేసింది. అయితే ఆ సంస్థ ఇతర ప్రాంతాల్లో చేసిన పనులకు సంబంధించిన బిల్లులను అప్పటి ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఈ బ్రిడ్జి పనులను నిలిపివేసింది.
రూ.450 కోట్లతో మరో బ్రిడ్జికి ప్రపోజల్స్
2023 ఎన్నికల్లో కాంగ్రెస్ గవర్నమెంట్అధికారంలోకి రావడం, మంచిర్యాల ఎమ్మెల్యేగా కె.ప్రేమ్‌సాగర్‌రావు గెలవడంతో మంచిర్యాల–అంతర్గాం బ్రిడ్జికి బ్రేక్ పడ్డది. ఈ బ్రిడ్జి నిర్మాణంతో మంచిర్యాల, పెద్దపల్లి మధ్య దాదాపు 18 కిలోమీటర్ల దూరం తగ్గుతున్నప్పటికీ హెవీ వెహికల్స్మంచిర్యాల టౌన్నుంచి రాకపోకలు సాగించాల్సి ఉంటుంది.
దీంతో జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ రద్దీ పెరగడం, కాలేజ్ రోడ్ఇరుకుగా ఉండడం, రైల్వే ఓవర్‌బ్రిడ్జి(ఆర్వోబీ) దగ్గర సమస్యలు తలెత్తే అవకాశం ఉండడం వల్ల ఈ బ్రిడ్జిని రద్దు చేస్తున్నట్టు ఎమ్మెల్యే పీఎస్సార్ ప్రకటించారు. ఈ మేరకు నిరుడు మార్చిలో బ్రిడ్జిని క్యాన్సల్ చేస్తూ అప్పటి గవర్నమెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్ ఆర్డర్స్ జారీ చేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా ముల్కల్ల, ముర్మూర్నడుమ గోదావరిపై రూ.450 కోట్ల అంచనాతో మరో హైలెవల్బ్రిడ్జి నిర్మాణానికి ప్రపోజల్స్రెడీ చేశారు. ఆ తర్వాత ఎలాంటి ప్రోగ్రెస్ లేకపోవడంతో రెండు జిల్లాల ప్రజలకు ఎదురుచూపులే మిగిలాయి.
బ్రిడ్జి నిర్మాణంతో తగ్గనున్న దూరాభారం
మంచిర్యాల, పెద్దపల్లి మధ్య దూరాభారం తగ్గించడం కోసమే మంచిర్యాల–అంతర్గాం బ్రిడ్జిని గత ప్రభుత్వం సాంక్షన్చేసింది. ప్రస్తుతం మంచిర్యాల, శ్రీరాంపూర్, గోదావరిఖని, బసంత్‌నగర్ నుంచి రాజీవ్‌రహదారి మీదుగా పెద్దపల్లికి వెళ్లాలంటే 40 కిలోమీటర్లు ప్రయాణించాలి. మంచిర్యాల–అంతర్గాం బ్రిడ్జి నిర్మిస్తే దాదాపు 18 కిలోమీటర్ల దూరం తగ్గేది. మంచిర్యాల నుంచి నేరుగా బసంత్‌నగర్ రాజీవ్ ఫోర్ లైన్‌కు చేరుకునే అవకాశం ఉండేది.
కొత్తగా ప్రతిపాదించిన ముల్కల్ల–ముర్మూర్బ్రిడ్జి నిర్మాణంతో రెండు జిల్లా కేంద్రాల మధ్య 5 కిలోమీటర్ల దూరమే తగ్గుతుంది. పైగా అంచనా వ్యయం రూ.164 కోట్ల నుంచి రూ.450 కోట్లకు అంటే దాదాపు రూ.300 కోట్లు పెరుగుతుంది. అంతర్గాం బ్రిడ్జికి కేవలం 15 ఎకరాల భూమి అవసరం కాగా.. ముల్కల్ల–ముర్మూర్ బ్రిడ్జికి సుమారు వందెకరాలు సేకరించాల్సి ఉంటుందని అంచనా. ఇప్పటికే ముల్కల్ల శివారులో ఎన్ హెచ్63 గ్రీన్‌ఫీల్డ్ హైవేకు భూములు ఇవ్వబోమని రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అటు ఎల్లంపల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులు కూడా ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు.
