చెక్ డ్యాంల నిర్మాణమే జలసంరక్షణకు పరిష్కారం

చెక్ డ్యాంల నిర్మాణమే జలసంరక్షణకు పరిష్కారం

ఒక భారీ లేదా మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టు నిర్మించాలంటే అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.  నీటి లభ్యత, నిర్మించాల్సిన సరియైన ప్రదేశం గుర్తించాలి.  కేంద్ర జల సంఘ అనుమతులు,  పర్యావరణ అనుమతులు పొందాలి.  అంతర్రాష్ట్ర వివాదాలు పరిష్కరించాలి.   భూసేకరణ, ముంపునకు గురయ్యే భూమికి రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారం చెల్లించాలి.  

రాజకీయ ఒడుదొడుకులు, బడ్జెట్ కేటాయిం పులు, నిధులు లభ్యత, కాంట్రాక్టర్ల  నిబద్ధత, ప్రకృతి సహకారం తదితర అంశాలపై వాటి అతీగతీ ఆధారపడి ఉంటుంది. ఇన్ని అనుకూలించినా ఒక్కో ప్రాజెక్ట్ నిర్మాణానికి దశాబ్దాలు సమయం పట్టిందని చరిత్ర చెపుతోంది. కాకతీయుల కాలం నాటి నుంచి నిజాం రాజుల వరకు నీటి వనరుల సంరక్షణకు వేలాది చెరువులు, కుంటలు తవ్వించారు.

వాగులు, కాలువలపై మాట్లు కట్టించి వర్షపు ప్రతి నీటి బొట్టు ఒడిసిపట్టి రైతుల పంటలకు దన్నుగా ఉంటూ వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చడానికి గణనీయమైన కృషి చేశారు. వారు చేపట్టిన నీటి సంస్కరణలు అద్భుతమైనవిగా చరిత్రలో నిలిచిపోయాయి. ముఖ్యంగా జల సంరక్షణ పట్ల సామాజిక బాధ్యతను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో ఒక విధంగా వారు విజయవంతం అయ్యారనడంలో సందేహం లేదు. ఇప్పటిలా ఏ ఒక్క చెరువు, కుంట..  గతంలో  కబ్జాలకు గురి కాలేదు. అందుకే వ్యవసాయంతోపాటు, చేపల పెంపకం, తాగడానికి నీటి సౌలభ్యం,  తదితరాలకు చిన్న నీటి వనరులు తెలంగాణ సమాజంలో అంతర్భాగమయ్యాయి.

భారీ ఇరిగేషన్ ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం ఎంత..?

తెలంగాణలో స్వాతంత్ర్యానికి పూర్వం 1931లో  నిజాం సర్కార్ నిర్మించిన నిజాం సాగర్ డ్యాం 17.80 టీఎంసీలు,  స్వాతంత్ర్యానంతరం నిర్మించిన నాగార్జునసాగర్ 405.1, శ్రీరాంసాగర్ 112.02, జూరాల 11.94, సింగూరు 30,  లోయర్ మానేరు డ్యాం 24.07,  ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ 20.17, మిడ్ మానేరు 25.87టీఎంసీలు కలుపుకొని మొత్తం నిలువ సామర్థ్యం 646.97 టీఎంసీలు ఉంది.  తెలంగాణ రాష్ట్రం  దక్కన్  పీఠభూమి కనుక నదుల నీటి ప్రవాహం కింది నుంచి ఉండటం వలన మన నీటిపారుదల అవసరాలు తీరడానికి గ్రావిటీ ద్వారా రావడానికి కష్టసాధ్యంగా మారింది. 

ఈ సమస్యను ఎదుర్కోవడానికి మొదట తుమ్మిడిహెట్టి వద్ద తలపెట్టిన ప్రాణహిత– చేవెళ్ల, తదనంతరం రీ డిజైన్ చేసిన కాళేశ్వరం వివిధ ప్యాకేజీల కింద 180 టీఎంసీలు, పాలమూరు× రంగారెడ్డి 67.52, సీతారామ 70, దేవాదుల 38.20, కల్వకుర్తి 25 మొదలగునవి కలుపుకొని 380.72టీఎంసీలు అవుతున్నాయి. అసలు మొత్తం ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు ద్వారా వాడే నీరు 1026.69టీఎంసీలు.

సముద్రంలో వృథాగా కలుస్తున్న నీరెంత..?

2025 నీటి సంవత్సరంలో జూన్ నుంచి  అక్టోబర్ వరకు జలసంఘం నివేదిక ప్రకారం మన తెలంగాణ మీదుగా ప్రవహించే గోదావరి నది ద్వారా 3721.49 టీఎంసీలు,  కృష్ణా నుంచి 1331.99టీఎంసీలు, మొత్తం 5053.48 టీఎంసీలు వృథాగా సముద్రంలో కలిసాయి.  మనకు వాటాగా కేటాయించిన నీటిని వాడుకోవాలన్నా కూడా మరిన్ని ప్రాజెక్టులు కావాలి. ఇప్పటికిప్పుడు  అవి నిర్మించడం సాధ్యం కాదు. 

తెలంగాణలో సాధారణ వర్షపాతం 906 మిల్లిమీటర్లు. ఉదాహరణకు 2022-– 23 సంవత్సరాన్ని తీసుకుంటే 1387.8 మి.మీ అనగా 53 శాతం అధిక వర్షపాతం నమోదయ్యింది.  ప్రతి ఏటా ఇలా వర్షాలు కురిసి కాలువలు, వాగులు, నదుల ద్వారా వృథాగా సముద్రంలో  కలిస్తే జాతి సంపదను ఎంతగా నష్టపోతున్నామో గమనించాలి. స్వల్పకాలిక చర్యల వల్ల నీటిని ఎలా ఒడిసిపట్టాలి అన్నది ఆలోచించాలి.

వర్షపు నీటి నిలువ పెరిగితే..

వర్షపు నీటి నిలువలు పెరిగితే భూగర్భ జలాలు పైకి వస్తాయి. బోర్లు రీ ఛార్జ్ అవుతాయి. నీరు పైకి తోడటానికి మోటర్లపై భారం తక్కువై, విద్యుత్ ఖర్చు సగానికి సగం తగ్గుతుంది. పర్యావరణం సమతుల్యం అవుతుంది. జీవజాతులు వృద్ధి చెందుతాయి. రాష్ట్రవ్యాప్తంగా కూలీలకు ముమ్మరంగా పనులు దొరుకుతాయి. రైతులకు పంటలు సమృద్ధిగా పండుతాయి. 

తాగునీటి కష్టాలు తీరుతాయి. చేపల పెంపకం అభివృద్ధి చెందుతుంది. కులవృత్తులు మరల పూర్వ వైభవం సంతరించుకుంటాయి. రైతుల కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరుస్తాయి.  ఇన్ని ఉపయోగాలున్న చెక్ డ్యాంల నిర్మాణం నీటి సంరక్షణకు గొప్ప పరిష్కారమని ప్రభుత్వం గుర్తించాలి.

చెక్ డ్యాంల నిర్మాణమే ఉత్తమ మార్గం

తెలంగాణ రాష్ట్రంలో సుమారు 12,777 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.  ప్రతి గ్రామం ద్వారా ఏదో ఒక కాలువ, వాగు  ప్రకృతిసిద్ధంగా ప్రవహిస్తూ ఉన్నాయి. యుద్ధ ప్రాతిపదికన ఒక ఆర్థిక సంవత్సరంలో  కనీసం రెండూళ్ల కొకటి చొప్పున వాగులపై  చెక్ డ్యామ్​లు నిర్మించాలి. 

వీటి నిర్మాణానికి కేవలం ఆర్నెళ్ల నుంచి ఏడాది సమయం మాత్రమే పడుతుంది.  ప్రతి చెక్ డ్యామ్​కు  రూ.కోటి  నుంచి 3 కోట్లు ఖర్చు అవుతుందనే అంచనా వేసుకున్నా రూ.1500 కోట్లతో అద్భుత ఫలితాలు వస్తాయి.  బడ్జెట్ పరంగా ప్రభుత్వాలకు భారం కూడా కాదు.  ఏటా 700 చెక్ డ్యామ్​లలో కనిష్టంగా 0.05 టీఎంసీల  నీరు నిలువ చేస్తే 35 టీఎంసీలు అవుతాయి. తద్వారా మూడున్నర లక్షల ఎకరాల  అదనపు ఆయకట్టు అభివృద్ధి చెందుతుంది.  వందల కోట్ల సంపద సృష్టి జరుగుతుంది.  

- దురిశెట్టి మనోహర్,
రిటైర్డ్​ ఏడీఈ