కంటైనర్ ఆస్పత్రులతో ఆదివాసీల కష్టాలకు చెక్ !..భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు నాలుగు ఆస్పత్రులు మంజూరు

కంటైనర్ ఆస్పత్రులతో  ఆదివాసీల కష్టాలకు చెక్ !..భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు నాలుగు ఆస్పత్రులు మంజూరు
  • ప్రసుత్తం గుండాల, ఆళ్లపల్లి, దుమ్ముగూడెం, అశ్వారావుపేట మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఏర్పాటు 
  • డోలీ కట్టి.. వాగులు, వంకలు దాటుతూ కిలోమీటర్ల కొద్దీ వెళ్లకుండా సర్కారు చర్యలు 

భద్రాచలం,వెలుగు : పురిటినొప్పులొస్తే, విష పురుగులు  కాటేస్తే, అడవి జంతువులు దాడి చేస్తే , అతిసార లాంటి వ్యాధులు సోకి సొమ్మసిల్లి పడిపోతే వైద్యం కోసం డోలీ కట్టి కిలోమీటర్ల దూరం మోసుకుంటూ వెళ్లాలి. వాగులు పొంగితే, కొండలు, గుట్టలు దిగి రాలేక అడవిలో పసరు మందులపై ఆధారపడే పరిస్థితి భద్రాచలం మన్యంలో ఉంది. ఆదివాసీలకు ఇలాంటి కష్టాలకు చెక్​ పెట్టేందుకు తెలంగాణ సర్కారు కంటైనర్​ ఆస్పత్రులను తీసుకొచ్చింది. ములుగు జిల్లాలో తొలి కంటైనర్​ ఆస్పత్రి సక్సెస్​ అయిన నేపథ్యంలో భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు నాలుగు కంటైనర్ ఆస్పత్రులను మంజూరు చేసింది. ఆళ్లపల్లి, గుండాల, వినాయకపురం, కాశీనగరంలో ప్రస్తుతం ఇవి ఏర్పాటు కానున్నాయి. 
 

మారుమూల గ్రామాల్లో..

గుండాల మండలం సాయినపల్లి, ఆళ్లపల్లి మండలం అనంతోగు, దుమ్ముగూడెం మండలం కాశీనగరం, అశ్వారావుపేట మండలం వినాయకపురం లాంటి మారుమూల గ్రామాల్లో ఈ కంటైనర్​ ఆస్పత్రులను నిర్మిస్తున్నారు. ఇందులో అత్యవసర వైద్యం అందించేందుకు అన్ని వసతులు ఉంటాయి. ఏఎన్​ఎంలు, ఆశావర్కర్లు అందులో ఉంటారు. సమీపంలోని పీహెచ్​సీ నుంచి వైద్యుడు వచ్చేలోపు వీరు ప్రథమ చికిత్స అందిస్తారు. 

బెడ్స్, సెలైన్​బాటిల్స్ పెట్టేందుకు వీలుంటుంది. షుగర్​, బీపీతో పాటు అనేక రకాల రోగాలకు ఇక్కడ మందులను అందుబాటులో ఉంచుతారు. మలేరియా, డెంగ్యూ లాంటి రోగ నిర్ధారణ పరీక్షలు సైతం చేస్తారు. గర్భిణీలకు అవసరమైన మందులు, వైద్యం ఉంటుంది. వైద్యుడికి, సపోర్టింగ్​ స్టాఫ్​, రోగులకు, మందుల కోసం ఇలా ప్రత్యేక క్యాబిన్​లు, బాల్కానీ ఈ కంటైనర్​లో ఉంటాయి. సాధారణ రోగాలకు వైద్యం కోసం దూరం వెళ్లే దుస్థితి ఆదివాసీలకు తప్పుతుంది. వీటిని చుట్టుపక్కల ఉన్న ప్రతీ గిరిజన గ్రామం వినియోగించుకునేలా సౌకర్యాలు కల్పిస్తున్నారు. 

అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం.. 

జిల్లాలో గుర్తించిన నాలుగు ప్రాంతాల్లో అన్ని హంగులతో కంటైనర్​  ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నాం. గిరిజనులకు వైద్యం కోసం ఇబ్బందులు పడకూడదనేది ప్రభుత్వం ఉద్దేశ్యం. వర్షాకాలంలో వచ్చే సీజనల్​ వ్యాధుల నియంత్రణ, వాగులు, వంకలు దాటి రాలేని మారుమూల గిరిజన గ్రామాల వారి కోసం ఈ కంటైనర్​ ఆస్పత్రులు ఎంతో ఉపయోగపడతాయి. వీటిలో ప్రత్యేకంగా సిబ్బందిని, మందులు అన్ని వేళలా ఉంచుతాం. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. - డాక్టర్​ జయలక్ష్మి, డీఎం​హెచ్​వో, భద్రాద్రికొత్తగూడెం

కష్టాలు తీరినట్లే.. 

మా ఊరిలో కంటైనర్​ ఆస్పత్రి పెట్టడం వల్ల కష్టాలు తీరినట్లే. చుట్టుపక్కల ఎలగలగడ్డ, గన్నాపురం, తక్కెళ్లగూడెం, కొమ్ముగూడెం, వెంకటాపురం, చిన వెంకటాపురం లాంటి గ్రామాల వారికి ఈ ఆస్పత్రితో ఉపయోగం ఉంది. ఏ చిన్న సుస్తీ చేసినా గుండాల మండల కేంద్రానికి పోవాల్సి వస్తోంది. ఇప్పుడు ఆ కస్టాలు ఉండవు. - గడ్డం రాములు, సాయినపల్లి,గుండాల