
మహబూబాబాద్, వెలుగు : సీఎం కేసీఆర్ ఆదేశిస్తే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున డోర్నకల్ నుంచి పోటీ చేస్తానని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. డోర్నకల్ నియోజకవర్గానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగులు హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ లో ఆదివారం ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా మంత్రి హాజరయ్యారు. ‘మళ్లీ మీరు డోర్నకల్ నుంచి పోటీ చేస్తే.. అన్ని విధాలా సహకరిస్తాం’ అని రిటైర్డ్ఉద్యోగులు అనడంతో ఆమె స్పందించారు.
తన రాజకీయ జీవితం డోర్నకల్ నుంచే ప్రారంభమైందని, సీఎం కేసీఆర్ అవకాశం కల్పిస్తే తప్పకుండా పోటీ చేస్తానన్నారు. అభివృద్ధిలో భాగంగా డోర్నకల్ మున్సిపాలిటీకి రూ.25 కోట్ల కేటాయించినట్లు తెలిపారు. త్వరలో డోర్నకల్ లో మరో గిరిజన గురుకులాన్ని మంజూరు చేయనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం డోర్నకల్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్కే చెందిన రెడ్యా నాయక్ కొనసాగుతుండగా మంత్రి కామెంట్స్‌తో నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. కార్యక్రమంలో రిటైర్డ్ ప్రొఫెసర్ నాగు బండి లక్ష్మణ్, రిటైర్డ్ టీచర్, కళాకారుడు ఆనంద్ కుమార్, అడ్వకేట్ కుమారస్వామి, స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబర్ బృందాదార్ రావు పాల్గొన్నారు.