
పద్మారావునగర్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి కృషి, పట్టుదలతోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ.303 కోట్లు వచ్చినట్లు ఎమ్మెల్యే శ్రీగణేశ్ తెలిపారు. కంటోన్మెంట్పరిధిలో రూ.303 కోట్లతో చేపట్టనున్న నాలాలు, డ్రైనేజీ నిర్మాణ పనులపై బుధవారం కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. ప్రజాప్రతినిధులు, హెచ్‌ఎండీఎ, హెచ్‌ఎండబ్ల్యూఎస్ అధికారులతో పాటు ఎమ్మెల్యే శ్రీగణేశ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం ద్వారా కంటోన్మెంట్ బోర్డుకు రూ.303 కోట్లు లభించాయన్నారు. గతంలో ఈ ప్రాంతానికి ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్నందున ఇక్కడి సమస్యలను సీఎం రేవంత్రెడ్డి బాగా అర్థం చేసుకుంటున్నారన్నారు.
టెండర్లు ఖరారయ్యేలోపు ప్రజల సూచనలు, సలహాలు స్వీకరించి ఏ ఏ ప్రాంతాల్లో డ్రైనేజీ, నాలాలు అభివృద్ధి చేయాలో నిర్ణయించి అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. 30 రోజులలో టెండర్లు ఖరారు కానున్నాయని, ఈ సమయంలో ప్రజలు తమ వినతులు, సూచనలు కంటోన్మెంట్‌బోర్డుకు అందజేయాలని ఎమ్మెల్యే సూచించారు. డ్రైనేజీలు, రోడ్లకు నిధులను ఒకేసారి విడుదల చేసి పనులు వేగంగా పూర్తి చేస్తే ప్రజలకు ఇబ్బందులు ఉండవన్నారు.